బుధవారం 03 జూన్ 2020
Telangana - May 10, 2020 , 01:29:24

కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దు

కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దు

  • వైద్యవిభాగాలు మరింత అప్రమత్తం కావాలి
  • సిబ్బంది మరికొద్ది రోజులు నిబద్ధతతో పనిచేయాలి
  • జిల్లా వైద్యాధికారులతో మంత్రి ఈటల వీడియోకాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖంపట్టాయని ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రభుత్వ విధానాలతో సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. వైద్యులు, ఇతర సిబ్బంది రెండు నెలలుగా నిద్రాహారాలు మాని కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కృషిచేస్తున్నారని అభినందించారు. శనివారం జిల్లా వైద్యాధికారులతో బీఆర్కే భవన్‌లోని తన కార్యాలయం నుంచి మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలుపై చర్చించారు. నిన్నటివరకు అన్నిశాఖలు సమన్వయంతో కరోనా నియంత్రణకు పనిచేశాయని, సడలింపుల నేపథ్యంలో మిగిలిన శాఖలు వాటి పనిలో అవి ఉంటాయని మంత్రి చెప్పారు. దీంతో కరోనా భారం మొత్తం వైద్యశాఖపై పడుతుందని తెలిపారు. ఆశ వర్కర్ల నుంచి రాష్ట్రస్థాయి వైద్య సేవా విభాగాల వరకు ప్రతి ఉద్యోగి సెలవులు తీసుకోకుండా నిబద్ధతతో మరికొన్ని రోజులు పనిచేయాలని కోరారు.  కంటైన్మెంట్‌ జోన్లలో గర్భిణులుంటే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. గద్వాలలో గర్భిణి మృతి ఘటన బాధాకరమ ని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. 

తక్కువ లక్షణాలుంటే ఇంటి వద్దే చికిత్స

ఐసీఎమ్మార్‌ కొత్త నిబంధనలు జారీచేసిందని, వీటి ప్రకారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేవారి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉన్నదని ఈటల చెప్పారు. తక్కువ లక్షణాలున్నవారికి ఇంటి వద్దే ఉంచి చికిత్స అందించాలని కొత్త మార్గదర్శకాలు చెప్తున్నాయని వివరించారు. వీడియోకాన్ఫరెన్సులో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌ యోగితారాణా,తరులు పాల్గొన్నారు.

ఆయుర్వేద రక్ష కిట్ల పంపిణీ

రెడ్‌జోన్‌లో పనిచేస్తున్న పోలీసులు, మున్సిపల్‌, వైద్యసిబ్బందికి ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో ఆయుర్వేద రక్ష కిట్లను అందజేస్తున్నారు. ఐదురకాల మందులతో కూడిన కిట్ల పంపిణీని మంత్రి ఈటల శనివారం బీఆర్కే ప్రారంభిం చారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ జాయింట్‌ సీపీ విశ్వప్రసాద్‌, హోంగార్డ్స్‌ ఐజీపీ బాల నాగదేవిలకు కిట్లను అందజేశారు. విశ్వఆయుర్వేద పరిషత్‌ తరఫున 250 గ్రాముల చవన్‌ప్రాష్‌ డబ్బాలు పంచనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆయుష్‌ కమిషనర్‌ అలుగు వర్షిణి, కేంద్ర ఆయుర్వేద రిసెర్చ్‌ కౌన్సిల్‌ అధికారి డాక్టర్‌ సాకేతరాం, నోడల్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌, విశ్వ ఆయుర్వేద పరిషత్‌ జాతీయ కార్యదర్శి ప్రేమానందరావు, ఏడీ అనసూయ పాల్గొన్నారు. 


logo