శనివారం 11 జూలై 2020
Telangana - May 29, 2020 , 01:38:28

కరోనాకు గాంధీలో మెరుగైన చికిత్స

కరోనాకు గాంధీలో మెరుగైన చికిత్స

  • మరణాల తగ్గింపే లక్ష్యం
  • కరోనాకు గాంధీలో మెరుగైన చికిత్స: మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ మృతుల సంఖ్య ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో తక్కువగా ఉన్నదని, తెలంగాణలో కూడా తక్కువేనని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. నాణ్యమైన చికిత్స ద్వారా మరణాల శాతం తగ్గించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. గురువారం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో గాంధీ వైద్య బృందం, మెడికల్‌ అడ్వైజరీ బోర్డు సభ్యులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పూర్తిస్థాయి కొవిడ్‌ దవాఖానగా గాంధీని ప్రకటించుకొని వైరస్‌ సోకినవారికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు 1,321 మందికి చికిత్స అందించి క్షేమంగా ఇంటికి పంపించామని తెలిపారు.

గాంధీ వైద్యులు అందిస్తున్న సేవలపై డిశ్చార్జి అయినవారు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు మరణించినవారిలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఉన్నారని వివరించారు. లాక్‌డౌన్‌ సడలింపుతో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా చికిత్సలో భాగంగా గాం ధీలో మందులతోపాటు అవసరమైన ఇతర సౌకర్యాలకు సంబంధించి నివేదిక అందించాలని సూపరింటెండెంట్‌ రాజారావుకు సూచించారు. గాంధీ దవాఖానలో ఉన్న ఆయా వార్డుల్లోని పడకలను కూడా ఐసీయూ, హై డెవలప్‌మెంట్‌ యూనిట్‌, స్టెప్‌డౌన్‌ యూనిట్‌గా విభజించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లుచేయాలని, బాధితులు మృత్యువాతపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.


logo