మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 26, 2020 , 01:59:40

డాక్టర్లకు అన్ని సదుపాయాలు

డాక్టర్లకు అన్ని సదుపాయాలు

  • లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలి : మంత్రి ఈటల 
  • పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్ల పరిశీలన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు,  ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. కరోనా బాధితులకు సేవలందించేవారు వినియోగించే పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లను బుధవారం బీఆర్కే భవన్‌లో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌నుంచి రాష్ర్టాన్ని కాపాడేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ లాంటి అసాధారణ నిర్ణయాలు తీసుకొన్నదని, దీనికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. ఇండ్లనుంచి బయటికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అదే సమయంలో పోలీసులు సంయమనం పాటించాలని కోరారు. వైరస్‌ పరీక్షల కోసం వినియోగిస్తున్న స్వాబ్‌, టెస్ట్‌ ట్యూబ్‌లను మంత్రి పరిశీలించారు. 

అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైద్యులకు, వైద్య సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో కొవిడ్‌-19 సోకకుండా చూసుకోవాలని, సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. పారా మెడికల్‌ సిబ్బంది దవాఖానకు చేరుకోవడానికి కావాల్సిన రవాణా సదుపాయాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కరోనా బాధితులకు సేవలంది స్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని ఇబ్బంది పెట్టొద్దని పోలీసులకు విజ్ఞప్తిచేశారు. కొన్నిచోట్ల ఎదురైన ఘటనలను డీజీపీ మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. క్యాన్సర్‌, డయాలసిస్‌ పేషెంట్లు దవాఖానకు వెళ్లే సమయంలో ఇబ్బంది లేకుండా పోలీస్‌స్టేషన్‌ నుంచి రూట్‌ పాస్‌ ఏర్పాటు చేయాలని డీజీపీని కోరారు.

రుచి.. వాసన తెలియదు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందివంటివే కరోనా ప్రధాన లక్షణాలని అనుకున్నాం. కానీ కొత్తగా.. రుచిని గుర్తించకపోవడం, వాసనను పసిగట్టలేకపోవ డం, విరేచనాలు కూడా కరోనా లక్షణాలేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొందరు బాధితుల్లో జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపించకపోయినా.. వాసన, రుచిని గుర్తించకపోవడం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలిపారు. విదేశాలకు వెళ్లి వచ్చినవారు కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని  వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

  • రాష్ట్రంలో మొత్తం 40 కేసులు.. వైద్యారోగ్యశాఖ బులెటిన్‌

రాష్ట్రంలో బుధవారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిని ఐసొలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు వైద్యారోగశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ (43)కు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా వైరస్‌ సోకింది. సౌదీ నుంచి వచ్చిన కుటుంబంలోని బాలుడికి (3) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పేర్కొన్నది. బుధవారంనాటికి రాష్ట్రంలో 41 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో ఒకరు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్టు వివరించింది. ప్రస్తుతం 40 మందిని ప్రభుత్వ దవాఖానల్లోని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కరోనా అనుమానిత లక్షణాలతో బుధవా రం 50 మంది దవాఖానల్లో చేరగా, ఇప్పటివరకు వీరి సంఖ్య 813కు చేరింది.


logo
>>>>>>