శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 02:06:18

బయట తిరుగొద్దు

బయట తిరుగొద్దు

  • విదేశాలనుంచి వచ్చినవారు ఇండ్లలో ఉండటమే చికిత్స
  • ఐసొలేషన్‌ సేవలకోసం అందుబాటులో 15 వేల బెడ్లు 
  • ప్రైవేటు వైద్యకళాశాలల యాజమాన్యాలు సహకరించాలి
  • వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి  ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 వైరస్‌ స్టేజీ-2లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరికివారు ఇండ్లలో ఉండటమే సరైన చికిత్సఅని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. విదేశాల నుంచి వచ్చి హోంక్వారంటైన్‌లో ఉన్నవాళ్లు 14 రోజులపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరూ చనిపోలేదని.. 33 పాజిటివ్‌కేసుల్లో ఎవరికీ సీరియస్‌ లేదని తెలిపారు. 97 మంది అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నవారిని 14రోజుల తర్వాత పరీక్షలు చేసి ఇంటికి పంపించనున్నట్టు తెలిపారు. 

సికింద్రాబాద్‌, కరీంనగర్‌లో సెకండ్‌ స్టేజీకి వైరస్‌వ్యాప్తి చేరుకున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తిచేశారు.వైరస్‌ సోకిన తర్వాత నయం చేయడం చాలా కష్టమనే విషయం ప్రపంచానికి అర్ధమైందని, వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో ఈ పది రోజులు చాలా కీలక సమయమని తెలిపారు. సహనంతోనే దీనిని తరిమికొట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈనెల 31 వరకు అందరూ ఇండ్లకే పరిమితం కావాలని ప్రజలకు సూచించారు. ప్రైవేటు వైద్యకళాశాలల్లో ఉన్న బెడ్లు సిద్ధం చేయాలని, ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అందరూ సహకరించాలని ఈటల పేర్కొన్నారు. కోఠిలోని కరోనా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ప్రైవేటు వైద్యకళాశాల యాజమాన్య ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సహకరిస్తే ఎక్కువ మందికి వైద్య సేవలు అందించగలుగుతామన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఐసీయూ, ఐసోలేషన్‌ బెడ్లను ఉపయోగించుకోనున్నట్టు తెలిపారు. బోధనాసుపత్రులకు కావాల్సిన పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్లు, పీపీటీ కిట్లు, శానిటైజర్లు, ఇతర పరికరాలు అందజేస్తామని చెప్పారు. ప్రైవేటు వైద్యకళాశాలలతో సమన్వయానికి కాళోజీ యూనివర్శిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఆర్డీవో స్థాయి అధికారిని ప్రతి కొవిడ్‌-19 ఐసొలేషన్‌ సేవలందించే ఆసుపత్రికి నోడల్‌ అధికారిగా నియమిస్తామన్నారు. సాధారణ జబ్బులతో వచ్చేవారిలో అత్యవసర పరిస్థితి లేకపోతే అడ్మిట్‌ చేసుకోవద్దని, సాధ్యమైనంత ఎక్కువ బెడ్లు కరోనా వైరస్‌ కేసుల కోసం అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికానే భయపడుతున్నదని.. మనం ఆషామాషీగా తీసుకోవద్దని తెలిపారు. సమావేశంలో డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరోనా కంట్రోల్‌ రూం

  • ఇంచార్జిలుగా ఇద్దరు సీనియర్‌ అధికారులు 
  • కంట్రోల్‌ రూం నంబర్లు
  • 04023450735 
  • 04023450624

 కరోనా కట్టడిలో భాగంగా వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా కంట్రోల్‌ రూంను ఏర్పాటుచేసింది. 24 గంటలూ పనిచేసే ఈ కంట్రోల్‌ రూంకు ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్‌ రాహుల్‌బొజ్జా, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఇంచార్జిలుగా వ్యవహరిస్తారు. వీరికి సహాయకులుగా ఐఏఎస్‌ అధికారి సీహెచ్‌ శివలింగయ్య, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. పోలీసుశాఖ నుంచి ఐపీఎస్‌ అధికారి బాలనాగదేవి, సైబరాబాద్‌ అడిషనల్‌ ఎస్పీ కే శ్రీనివాస్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త సంచాలకులు మోతిలాల్‌నాయక్‌, జాన్‌బాబు విధులు నిర్వర్తిస్తారు. 


logo