గురువారం 28 మే 2020
Telangana - May 14, 2020 , 01:48:10

వలస కూలీలపై అప్రమత్తం

వలస కూలీలపై అప్రమత్తం

  • బయటి నుంచి వస్తే క్వారంటైన్‌కు
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల
  • రాష్ట్రంలో కొత్తగా 41 కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వివిధ రాష్ర్టాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉంటున్న కారణంగా.. వారి పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, వైరస్‌ వ్యాప్తిని కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలోకి పెద్దఎత్తున వలస కార్మికులు, ఇతరులు వస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. మొదట విదేశాల నుంచి వచ్చినవారివల్ల, తర్వాత మర్కజ్‌తో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరిగిందని, ఇప్పుడు వలసకార్మికుల వల్ల ఆ ప్రమాదం ఉన్నదన్నారు. ఇతర ప్రాంతాలనుంచి తెలంగాణకు వస్తున్న వారందరినీ ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉంచుతున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు వివిధ మార్గాల్లో 41,805 మంది రాష్ర్టానికి వచ్చారన్నారు. సడలింపులతో ఎక్కువ మంది బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గడం సంతోషం కలిగించిందని తెలిపారు. 2014లో ఐఎంఆర్‌ 39శాతం ఉండగా.. ఇప్పుడు 27 శాతానికి తగ్గిందని, కేంద్రం నిర్వహించిన సర్వే దీన్ని స్పష్టంచేసిందని చెప్పారు. గాంధీ వైద్యులైన షర్మిల, రాణి బుధవారం కరోనా ఉన్న గర్భిణికి ప్రసవం చేశారన్నారు.

వచ్చేపోయేవారిపై నజర్‌

తెలంగాణకు ఇతర రాష్ర్టాల నుంచి వలస వస్తున్నవారితో కరోనా విస్తరిస్తున్నట్టు తెలుస్తున్నది. గత ఆరు రోజుల్లో ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వారిలో 35 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిపట్ల భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం వలసలు వస్తున్నవారిపై ప్రత్యేకదృష్టి సారించింది. జిల్లాల్లోకి ప్రవేశిస్తున్న కొత్తవారి వివరాలను నమోదు చేసుకొని, వారికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరిలోనైనా అనుమానిత లక్షణాలుంటే వెంటనే వారిని వైరస్‌ నిర్ధారణ కోసం దవాఖానకు తరలిస్తున్నారు. గత ఐదు రోజుల్లో ఆయా జిల్లాలనుంచి 66,959 మంది బయటకు వెళ్లగా, 41,805 మంది ప్రవేశించినట్టు ప్రత్యేక బృందాలు గుర్తించాయి. వలస వస్తున్నవారిని సరిహద్దుల్లోనే పరీక్షించి లక్షణాలున్నవారిని దవాఖానకు, లక్షణాలు లేనివారిని హోం లేదా ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు.

ఒక్కరోజే 117 మంది డిశ్చార్జి

రాష్ట్రంలో బుధవారం కొత్తగా 41 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 ఉండగా, 10 మంది ఇతర రాష్ర్టాల నుంచి వచ్చివారున్నారు. ఇద్దరు మృతి చెందగా, 117 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలు, గాంధీ దవాఖాన డాక్టర్ల ఉత్తమ సేవల కారణంగానే తాము పూర్తిస్థాయిలో కోలుకొని డిశ్చార్జి అవుతున్నామంటూ ఓ వ్యక్తి సూపరింటెండెంట్‌ రాజారావుకు ఫోన్‌ సందేశం పంపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం 48 కేసులు నమోదయ్యాయి. 

15 నుంచి మూడు జిల్లాల్లో కరోనా సర్వే

కరోనా సామాజిక వ్యాప్తిపై దేశవ్యాప్తంగా 69 జిల్లాల్లో 24 వేల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, సర్వే నివేదికను రూపొందించాలని ఐసీఎమ్మార్‌ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని కామారెడ్డి, నల్లగొండ, జనగామ జిల్లాల్లో ఈ నెల 15 నుంచి సర్వే చేపట్టనున్నారు.  హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎన్‌ ఆధ్వర్యంలో సర్వే చేపడుతారని, ఒక్కో జిల్లాలో ర్యాండమ్‌గా 400 మందికి పరీక్షలు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో కూడా సర్వే చేయనున్నట్టు ఉన్నతాధికారి చెప్పారు.

రాష్ట్రంలో కేసుల వివరాలు

వివరాలు
 బుధవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
411,367  
కోలుకున్న/డిశ్చార్జి అయినవారు
117939
మరణాలు
234
చికిత్స పొందుతున్నవారు
-394


logo