e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home Top Slides 50 పడకల దవాఖానల్లోనూ చికిత్స

50 పడకల దవాఖానల్లోనూ చికిత్స

50 పడకల దవాఖానల్లోనూ చికిత్స
  • అందుబాటులోకి మరో 10 వేల పడకలు
  • ప్రైవేట్‌లో 50% బెడ్స్‌లో ప్రభుత్వ ధరలకే వైద్యం
  • అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
  • 97 శాతం మందిలో కరోనా లక్షణాలు లేవు
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (నమస్తే తెలంగాణ): పడకలు 50 పైచిలుకు ఉన్న అన్ని ప్రైవేట్‌ దవాఖాన(నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ గుర్తింపు)ల్లో కరోనా బాధితులకు చికిత్స అందించాలని, దరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరుచేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. వ్యాపార కోణంలో కాకుండా మానవతాదృక్పథంతో వైద్యం అందించాలని పిలుపునిచ్చారు. బాధితుల నుంచి అధికచార్జీలు వసూలుచేసే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం కోఠిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ కార్యాలయంలో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, కార్పొరేట్‌, ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలతో మంత్రి వేర్వేరుగా సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చికిత్స, ఫీజులు, అనుమతుల విషయంపై చర్చించారు. 50 శాతం పడకల్లో ప్రభుత్వ ధరల ప్రకారం చికిత్స అందిస్తామని కార్పొరేట్‌ యాజమాన్యాలు చెప్పడాన్ని మంత్రి అభినందించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ టీచింగ్‌ దవాఖానల్లో కొవిడ్‌ సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రైవేట్‌ టీచింగ్‌ దవాఖానల్లో పూర్తి ఉచితంగా చికిత్స అందుతున్నదని పేర్కొన్నారు. మొత్తం 200 దవాఖానల్లో కనీసం 10 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 24 వేల పడకలు సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. ఫస్ట్‌ వేవ్‌ మాదిరిగానే కేసులు గరిష్ఠస్థాయికి వెళ్లి తగ్గే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు.
ధరలు తగ్గాయి.. చికిత్స చార్జీలూ తగ్గాలి
ఒకప్పుడు పీపీఈ కిట్లు, మందులు, ఇతర పరికరాలకు ప్రైవేట్‌ దవాఖానలు అధిక ధరలు వెచ్చించేవని, దీంతో ఎక్కువ చార్జీ వసూలు చేశాయని మంత్రి ఈటల చెప్పారు. ఇప్పుడు అన్నింటి ధరలు తగ్గిన నేపథ్యంలో చికిత్స చార్జీలు సైతం తగ్గాలని సూచించారు. దవాఖానల్లో వసూళ్లను పర్యవేక్షిస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ కంటే మాస్క్‌ వినియోగించడమే ఉత్తమమని స్పష్టంచేశారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నదని, 97 శాతం మందికి వైరస్‌ సోకినా లక్షణాలు కనిపించడంలేదని తెలిపారు. కొద్ది మందికి ప్రమాదకరంగా మారుతున్నదని, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయని, ఆ రాష్ర్టాల నుంచి రాకపోకల వల్లే మన వద్ద కేసుల సంఖ్య పెరుగుతున్నదని వివరించారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను రెట్టింపు చేస్తున్నామని, జిల్లా దవాఖానల్లో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ముందుగా ర్యాపిడ్‌ పరీక్షలు, ఆ తర్వాత అవసరమైతే ఆర్టీపీసీఆర్‌, అనంతరం సీటీ స్కాన్‌ వంటివి పద్ధతి ప్రకారం చేస్తామని వివరించారు.
30 లక్షల డోసులు పంపండి
ప్రస్తుత నిల్వలు 3 రోజులకే
కేంద్రానికి సీఎస్‌ సోమేశ్‌ లేఖ
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా వ్యాక్సిన్లు మూడు రోజులకే సరిపోతాయని, వచ్చే 15 రోజుల్లో కనీసం 30 లక్షల డోసులు అత్యవసరంగా అందజేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ రాశారు. ఈ మేరకు శనివారం కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం తమ వద్ద 5.66 లక్షల డోసులే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌భూషణ్‌కు రాసినలేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడబోతున్నదని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేశామని, శుక్రవారం ఒక్కరోజే 1.15 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు వివరించారు. ఈ సంఖ్యను రోజుకు 2లక్షలకు పెంచబోతున్నట్టు తెలిపారు.

Advertisement
50 పడకల దవాఖానల్లోనూ చికిత్స

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement