శనివారం 06 జూన్ 2020
Telangana - May 15, 2020 , 01:46:00

ఇంటింటా జ్వర పరీక్షలు

ఇంటింటా జ్వర పరీక్షలు

  • నేటినుంచి 43,900 మంది సిబ్బందితో గ్రామాల్లో సర్వే
  • కరోనా కట్టడే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఈటల రాజేందర్‌
  • పరీక్షల్లో పాల్గొనే సిబ్బంది
  • ఏఎన్‌ఎంలు 7,300 
  • ఆశ వర్కర్లు 25,600
  • అంగన్‌వాడీలు 11,000
  • మొత్తం 43,900

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇంటింటా జ్వర పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం గ్రామీణుల దరిచేరకుండా ఉండేందుకు ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టి ప్రజల్లో వ్యాధి లక్షణాలను గుర్తిస్తారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలిన సందర్భంలో ప్రతి వ్యకిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై అంచనాలు రూపొందిస్తున్న విధంగానే కరోనాను ముందస్తుగా గుర్తించేందుకు ఇంటింటా జ్వర పరీక్షలు నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఇండ్లకు వెళ్లి జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా లక్షణాలున్నవారి వివరాలను నమోదుచేస్తారు. ఎవరికైనా జ్వర, కరోనా సంబంధిత లక్షణాలుంటే అలాంటి వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని 43,900 మంది సిబ్బందితో కార్యాచరణ మొదలు పెట్టింది. 

సర్వేలో వ్యాధుల నమోదు: మంత్రి ఈటల 

కిందిస్థాయిలో కరోనా సర్వే చేస్తున్నప్పుడు ఎవరికైనా వైరస్‌ లక్షణాలున్నాయేమో తెలుసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. దవాఖానలకు ఓపీడీ సేవలు పొందేందుకు వచ్చేవారి వివరాలను సాధారణ వ్యాధులు, కరోనా సంబంధిత వ్యాధిగ్రస్థులను వేరుగా నమోదు చేయాలని సూచించారు. గురువారం ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలు, దవాఖానల సూపరింటెండెంట్లు, పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైరస్‌ అనుమానిత లక్షణాలున్నవారికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు చేయాలని ఐసీఎమ్మార్‌ సూచించిందని, కేంద్రంలో, రాష్ట్రంలో అవే విధానాలు అవలంబిస్తున్నట్టు వివరించారు. 

ఇతర ప్రాంతాల నుంచి ఆయా గ్రామాలకు వచ్చినవారిలో కరోనా లక్షణాలు లేకున్నా 14 రోజులు ఇండ్లల్లోనే క్వారంటైన్‌లో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరస్‌ నియంత్రణకు అన్నివిభాగాలు కృషిచేస్తున్నాయని, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల్లో 95శాతం మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా మరణాలు 2 శాతం నమోదైనట్టు తెలిపారు. తక్షణ సేవలకు 102, 104, 108 వాహనాలు సకాలంలో పనిచేస్తున్నాయా? లేదా చూసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎం, ఇతర వైద్యసిబ్బంది భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. 

గ్రామాల్లో సర్వేకు వెళ్తున్నప్పుడు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. వైద్యశాఖలోని ఔట్‌ సోర్సింగ్‌, కాంటాక్ట్‌, కాంటింజెన్సీ ఉద్యోగులెవరికైనా జీతాలు రాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితారాణా, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జీ శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, కాళోజీ వర్శిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, ఎక్స్‌పర్ట్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ గంగాధర్‌ పాల్గొన్నారు.

మంత్రిని కలిసినటీపీహెచ్‌డీఏ ప్రతినిధులు

 గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యాధికారుల సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గురువారం వైద్యా, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి కట్టడి, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు వెహికిల్‌ అలవెన్సు ఇవ్వాలని వారు కోరారు. మంత్రిని కలిసిన వారిలో టీపీహెచ్‌డీఏ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి జనార్దన్‌, రాష్ట్ర కార్యదర్శి అభిరామ్‌ ఉన్నారు. 


logo