బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 20, 2020 , 18:24:08

అభివృద్ధి దిశగా తీర్చిదిద్దండి : మంత్రి ఈటల రాజేందర్‌

అభివృద్ధి దిశగా తీర్చిదిద్దండి : మంత్రి ఈటల రాజేందర్‌

జగిత్యాల : చదువుకున్న వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. పట్టణాలను అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే సంజయ్‌, కలెక్టర్‌, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ పల్లెలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడితే కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. కానీ నేడు దేశ చిత్రపటం మీద మనం సమున్నతంగా నిల్చున్నామన్నారు. మనకు పరిపాలన రాదు అన్నారు. కానీ మన సీఎం కేసీఆర్‌ పరిపాలన అంటే ఎంటో చూపించి తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. దేశం తెలంగాణను చూసి గర్వపడుతుందన్నారు. తెలంగాణ సాధించిన విజయానికి విద్యుత్‌ రంగమే ఓ ఉదాహారణ అన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. అప్పట్లో చెప్పేది ఒకటి, చేసేది మరొకటి... కానీ ఇప్పుడు ఏం చెప్తున్నామో అదే చేసి చూపిస్తున్నాం. రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం తీసుకువచ్చామన్నారు. ఆరోగ్య తెలంగాణ అయితేనే బంగారు తెలంగాణ అవుతుందని మంత్రి పేర్కొన్నారు.


logo