శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:03

మనిషిని చంపే శక్తి కరోనాకు లేదు

మనిషిని చంపే శక్తి కరోనాకు లేదు

  • నిర్లక్ష్యంగా ఉంటేనే కాటేస్తుంది 
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల  

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మనిషిని చంపే శక్తి కరోనా వైరస్‌కు లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా ఉంటేనే ప్రమాదకరంగా మారుతున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ ముందస్తు నిర్ణయాల వల్ల కరోనాను దీటుగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని (ట్రూనాట్‌), మమత హాస్పిటల్‌లో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ఈటల ప్రారంభించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, ఆధునికమైన, నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మరణాల రేటు అతి తక్కువగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో సుమారు 1,300 మంది వైద్యులను కొత్తగా నియమించినట్లు తెలిపారు. జిల్లాల్లో కూడా అవసరం మేరకు ఏఎన్‌ఎంలను, నాలుగో తరగతి సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో 81 శాతం మందికి ఎలాంటి లక్షణాలూ లేవని, 14 శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని ఈటల వివరించారు. వీరందరికీ వెంటిలేటర్‌ అవసరం లేకుండానే చికిత్స అందిస్తున్నామన్నారు. మిగిలిన 5 శాతం మందికి నిర్లక్ష్యం వల్ల సీరియస్‌ అవుతున్నదన్నారు. వీరిలో కూడా దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఉన్నారన్నారు. వీరు కూడా 24 గంటల్లోపు దవాఖానకు వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహాన్ని మంత్రులు ఈటల రాజేందర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆవిష్కరించారు.


logo