శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 22, 2021 , 12:02:47

డయాగ్నొస్టిక్‌ సెంటర్లలో ఈసీజీ, అల్ట్రాసౌండ్‌: మంత్రి ఈటల

డయాగ్నొస్టిక్‌ సెంటర్లలో ఈసీజీ, అల్ట్రాసౌండ్‌: మంత్రి ఈటల

హైదరాబాద్‌: బస్తీ దవాఖానాల్లో పేదలకు ఉచిత వైద్య పరీక్షల కోసం డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. పేదలు వేలాది రూపాయలు ఖర్చుచేసి వేద్యం చేయించుకునే పరిస్థితిలేదని, వారికి అందుబాటులో ఉండేలా డయాగ్నొస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కేంద్రాల్లో రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. నగరంలోని లాలాపేటలో కొత్తగా ఏర్పాటుచేసిన డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనతరం మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో నేడు ఎనిమిది డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఈ కేంద్రాల్లో ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్‌, రేడియాలజీ సహా 57 రకాల రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు. పేదలకు రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తమని చెప్పారు. త్వరలోనే మరో 8 డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు. 


ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా గాంధీ దవాఖానలో రూ.35 కోట్లతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎనిమిది ఆపరేషన్‌ థియేటర్లతో అవయవ మార్పిడి సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆధునిక సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో ల్యాబులు విజయవంతమైతే జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. 

పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందించేలా డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పటు చేస్తున్నది. ఇప్పటివరకు రక్త, మూత్ర పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నది. కొత్తగా ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్షలు, రేడియాలజీ పరీక్షలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ లాలాపేట, శ్రీరాంనగర్‌, అంబర్‌పేట్‌, బార్కాస్‌, జంగంపేట, పానీపురా, పురానాపూల్‌, సీతాఫల్‌మండిలో డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు. వాటిని మంత్రి ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, మహమూద్‌ అలీ, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ప్రారంభించారు. 

VIDEOS

logo