గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 30, 2020 , 04:00:41

కరోనాతో భయంవద్దు

కరోనాతో భయంవద్దు
  • రాష్ట్రంలో ఒక్క కేసూ నమోదు కాలేదు
  • ప్రభుత్వపరంగా ముందస్తు చర్యలు చేపట్టాం
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌
  • గాంధీ దవాఖానను సందర్శించిన కేంద్ర బృందం
  • చైనా నుంచి తిరిగొస్తున్న తెలంగాణ విద్యార్థులు
  • చైనాలోనే శ్రీసిటీ టీసీఎల్‌ ఇంజినీర్లు?

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ బన్సీలాల్‌పేట్‌/ అంబర్‌పేట: తెలంగాణలో ఒక్క కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు కూడా నమోదుకాలేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. కరోనాపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని, ఆందోళన చెందవద్దని సూచించారు. కరోనా వైరస్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపట్టామని, అనుమానిత కేసులకు గాంధీ, ఫీవర్‌, ఛాతి దవాఖానల్లో వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లుచేశామన్నారు. 


ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ భవనంలో బుధవారం వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏ శాంతికుమారి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, ఫీవర్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌, కరోనా వైరస్‌ నోడల్‌ అధికారి విజయ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలపై చర్చించడంతోపాటు ఫిబ్రవరి మొదటివారంలో జరుగనున్న మేడారం జాతరలో వైద్యశాఖ తరఫున చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. 


అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ తెలంగాణకు పాకినట్టు నిర్ధారణ కాలేదన్నారు. ఆరోగ్యశాఖ అన్ని విషయాలను పర్యవేక్షిస్తున్నదని, చైనా నుంచి వచ్చినవారిలో ఐదుగురికి పరీక్షలు నిర్వహించగా ఎలాంటి లక్షణాలు లేవని నిర్ధారించారన్నారు. అదేవిధంగా మరో అయిదుగురికి కూడా నిర్ధారణ పరీక్షలు చేశామని, వాటికి సంబంధించి నివేదికలు అందాల్సి ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉన్నదని, ఇప్పటివరకు తెలంగాణలోనే కాకుండా.. మొత్తం దేశంలోనూ ఒక్క కేసు కూడా నమోదుకాలేదని వెల్లడించారు. 


శంషాబాద్‌ విమానాశ్రయంలో చైనానుంచి వచ్చేవారికి పరీక్షలు చేస్తున్నారన్నారు. ఇందుకోసం విమానాశ్రయంలో మూడు షిఫ్టుల్లో 12 మంది వైద్యులు పనిచేస్తున్నారని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గాంధీ, ఫీవర్‌, ఛాతి దవాఖానల్లో వంద పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేసి అనుమానిత లక్షణాలున్నవారికి వైద్యసేవలు అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.


బాధ్యతగా వ్యవహరించాలి

కరోనా వైరస్‌ గురించి అసత్య ప్రచారాలు చేయవద్దని, ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి ఈటల సూచించారు. జలుబు, దగ్గుతో కూడిన జ్వరం రావడం, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే కరోనాగా అనుమానించాలని చెప్పారు. దగ్గేటప్పుడు చేతిరుమాలు అడ్డుపెట్టుకోవడం, దగ్గు, తుమ్ములు వచ్చిన ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా ఈ వ్యాధిని వ్యాపించకుండా చూడొచ్చని పేర్కొన్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని, ప్రసార, సామాజిక మాధ్యమాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మేడారం జాతరలో 50 బెడ్లతో తాత్కాలిక దవాఖాన ఏర్పాటుచేసి అవసరమైన మందులు, అంబులెన్సులను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. అత్యవసర ప్రసవాల కోసం ప్రత్యేక లేబర్‌రూం ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. 


గాంధీలో ఏర్పాట్లు భేష్‌: కేంద్ర బృందం 

కేంద్ర వైద్య నిపుణుల బృందం బుధవారం గాంధీ దవాఖానకు వచ్చింది. డాక్టర్‌ అనితావర్మ, డాక్టర్‌ శుభ్‌గార్గ్‌, డాక్టర్‌ అజయ్‌చౌహాన్‌.. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, ఆర్‌ఎంవో, హెచ్‌వోడీలతో కలిసి కేంద్ర వైద్యనిపుణులు ప్రత్యేక వార్డును సందర్శించారు. గాంధీలో ప్రత్యేక వార్డులో ఏర్పాట్లు, అనుమానితులకు అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకొన్నారు. ప్రత్యేక వార్డుపై కేంద్ర వైద్యబృందం సంతృప్తి వ్యక్తంచేసిందని డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. 


పుణె ల్యాబ్‌కు నలుగురి శాంపిల్స్‌

ఫీవర్‌ దవాఖానలో చేరిన ముగ్గురి శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు బుధవారం పంపించారు. ఇటీవల చైనా నుంచి వచ్చిన దంపతులు, వారి కుమారుడు మంగళవారం ఫీవర్‌ దవాఖానకు రాగా, వారిని ప్రత్యేక వార్డులో చేర్చుకొని పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో వ్యక్తి కూడా ఇదే వార్డులో ఉన్నాడు. ఫీవర్‌ దవాఖానకు వచ్చినవారిలో ఒక్కరికి కూడా కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కాలేదు.


300 మంది భారతీయ విద్యార్థుల తరలింపు 

చైనా నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులు వారివారి స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. యాంగ్జో మెడికల్‌ వర్సిటీలో మన దేశానికి చెందిన 300 మంది విద్యార్థులు చదువుతుండగా.. వీరిలో తెలంగాణ, ఏపీలకు చెందిన 26 మంది ఉన్నట్టు సమాచారం. వర్సిటీ అధికారులు తమను అప్రమత్తం చేసి ఇండ్లకు వెళ్లిపోవాలని చెప్పారని, తిరిగి ప్రకటించేవరకు రావద్దని పేర్కొన్నట్టు నిజామాబాద్‌ జిల్లా బిక్కనూరుకు చెందిన వైద్యవిద్యార్థి గజవాడ అరవింద్‌ చెప్పారు..


చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజినీర్లు?

కరోనాతో వణికిపోతున్న చైనాలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన కొందరు ఇంజినీర్లు చిక్కుకొన్నట్టు తెలిసింది. చైనా వుహాన్‌ నగరంలో వీరు ఉన్నట్టు సమాచారం. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో శ్రీసిటీ టీసీఎల్‌ సంస్థకు ఎంపికైన 96 మంది ఇంజినీర్లు మూడునెలల శిక్షణ కోసం గతేడాది ఆగస్టులో వుహాన్‌ వెళ్లారు. 38 మంది నవంబర్‌ నెలలో భారత్‌ తిరిగిరాగా.. మిగిలిన 58 మంది అక్కడి హాస్టల్‌లో ఉన్నారు. వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు శ్రీసిటీ సంస్థ ప్రయత్నించినా నిషేధాజ్ఞలు అమలులోకి రావడంతో ప్రయత్నాలు ఫలించలేదు. చైనాలో చిక్కుకున్నవారిలో తెలంగాణవారు ఎందరనేది ఇంకా తెలియరాలేదు.


logo