బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 02:18:21

కరోనా చికిత్స ఇంట్లోనే

కరోనా చికిత్స ఇంట్లోనే

  • కాలనీ, ఆపార్టుమెంట్‌వాసులు సహకరించాలి
  • వైరస్‌ సోకినవారిని బహిష్కరించవద్దు
  • ప్రజలు భయాలు, అపోహలు వీడాలి
  • జీవనోపాధికే లాక్‌డౌన్‌ సడలింపులు
  • జ్వరం ఉంటే పీహెచ్‌సీల్లో చికిత్స
  • జర్నలిస్టులకు మెరుగైన వైద్యం
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల

హైదరాబాద్‌,  నమస్తే తెలంగాణ: లక్షణాలు లేకున్నా చాలా మందిలో కరోనా పాజిటివ్‌ వస్తున్న నేపథ్యంలో వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నవారికి 3 రోజులుగా ఇండ్లలోనే చికిత్స అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు ఇంట్లో ఉండేందుకు అపార్ట్‌మెంట్లు, కాలనీల ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు. కరోనా సోకిన వారిని బహిష్కరించడం సరికాదన్నారు. కరోనా గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందదని చెప్పారు. ప్రజలు అపోహలను వీడాలని విజ్ఞప్తిచేశారు. 

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, మరణాలు, వైద్యసేవల నిర్వహణపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన ఆదివారం బీఆర్కేభవన్‌లో సమీక్ష నిర్వహించారు. హోం క్వారంటైన్లో ఉండేందుకు అనుమతిచ్చినా ప్రజల్లో ఉన్న భయం వారిని దవాఖాన నుంచి బయటికి రానివ్వడంలేదన్నారు. కరోనా సోకిన వ్యక్తి ఇంటి పక్కన ఉంటే తమకు కూడా వైరస్‌ సోకుతుందేమోనన్న భయంతో చాలామంది హోంక్వారంటైన్‌లో ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. జియాగూడలో ఓ కాలనీలో ఇంటి పక్కనున్నవారు ఇబ్బంది పెట్టడంతో ఓ వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో దవాఖానకు రావాల్సి వచ్చిందని చెప్పారు. దీనివల్ల దవాఖానలపై అధిక భారం పడుతున్నదని, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నదని మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు.  

పనిలేకుండా బయట తిరగొద్దు

ప్రజలు జీవనోపాధి కోల్పోకుండా ఉండేందుకే లాక్‌డౌన్‌లో సడలింపులు తప్ప, పని లేకున్నా కూడా బయట తిరగడానికి కాదని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రజలు లాక్‌డౌన్‌ సడలింపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా మహమ్మారి ప్రాణాలను బలిగొంటున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు అవసరం లేకున్నా ఎక్కువ సంఖ్యలో బయటకు వస్తుండటంతోనే వైరస్‌ వ్యాప్తి పెరిగిందని చెప్పారు. అవసరం లేకున్నా బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు పాటించాలని పిలుపునిచ్చారు. 

వైద్యులు, జర్నలిస్టులను పరామర్శించిన మంత్రి 

కరోనా వైరస్‌ సోకిన వైద్యులు, వైద్య సిబ్బంది, జర్నలిస్టులతో మంత్రి ఈటల ఫోన్లో మాట్లాడారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కరోనాతో పోరులో ముందు వరుసలో ఉన్న వైద్యులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు  ఆదివారం యువ జర్నలిస్టు మనోజ్‌ మృతి తనకు తీవ్ర మనోవేదనను కలిగించిందని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమీక్షలో డీఎంఈ, టీవీవీపీ కమిషనర్‌ రమేశ్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, నిపుణుల కమిటీ సభ్యుడు గంగాధర్‌, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ రాజారావు పాల్గొన్నారు. 

జ్వరం లక్షణాలుంటే పీహెచ్‌సీల్లో చికిత్స  

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) స్థాయిలోనే చికిత్స అందించాలని అధికారులకు మంత్రి సూచించారు. దవాఖానల్లో మందులు, కిట్ల అందుబాటుపై ఆరా తీశారు. కరోనా చికిత్స కోసం ఇండ్లలో ప్రత్యేక గదులు లేనివారు జిల్లా కేంద్రంలోనే  ఐసొలేషన్‌లో ఉండేలాగా ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని, భూమ్మీద ఏ మందు ఉన్నా తెచ్చి చికిత్స అందిస్తామని భరోసా కల్పించారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని దవాఖాన సూపరింటెండెంట్‌ రాజారావును అడిగి తెలుసుకున్నారు.

తాజావార్తలు


logo