ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Aug 04, 2020 , 02:00:32

భయమే బీమార్‌

భయమే బీమార్‌

  • కరోనా సోకుతుందనే భయంతో ఆరోగ్యవంతులూ ఆత్మహత్య 
  • ‘పానిక్‌ అటాక్‌ డిజార్డర్‌'గా మారుతున్న ఆందోళన
  • తీవ్ర మానసిక ఆందోళనలో కొవిడ్‌ వ్యాధిగ్రస్థులు
  • పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువమందికి అగోరాఫోబియా
  • యోగా, కౌన్సెలింగే సరైన మందు అంటున్న నిపుణులు

ఇప్పుడు కరోను మించిన రోగమొకటి రాజ్యమేలుతున్నది. ‘నాకూ వైరస్‌ సోకుతుందేమో’ అన్న ఆలోచన ఆందోళనగా మారి.. అతి భయంగా అవతారమెత్తి.. మెదడును తొలిచేస్తున్నది. ‘చావు నీదాకా వచ్చేముందే నువ్వే మరణాన్ని ఆశ్రయిస్తే?’ అన్న అతి ప్రమాదకరమైన స్థితికి తీసుకెళ్తున్నది. ఫలితంగా ఆరోగ్యవంతులు, కరోనా ప్రాథమిక లక్షణాలు ఉన్నవారూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ.. వందలో 99 మంది కోలుకుంటున్నారని, పసిగుడ్డు నుంచి పండు ముసలివరకు కొవిడ్‌ను ఒంటిచేత్తో గెలిచారనే సత్యాన్ని విస్మరిస్తున్నారు. జాగ్రత్తగా ఉంటే కరోనా దరి చేరదని తెలిసినా.. ఆరోగ్యంగానే ఉన్నాం అని శరీరం చెప్తున్నా వినకుండా తనువు చాలిస్తున్నారు. అనవసర భయంతో కుటుంబాన్ని వీధిన పడేస్తున్నారు. పిల్లలను అనాథలను చేస్తున్నారు. 

రెండు రోజుల కిందట హైదరాబాద్‌లోని ఎంఎస్‌ మక్తాలో వృద్ధ దంపతులకు జ్వరం, దగ్గు రావడంతో కరోనా సోకిందని అనుమానించారు. తమ వల్ల ఈ మహమ్మారి కొడుకులకు, వారి పిల్లలకు అంటుకుంటుందేమోననే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపారు. కొవిడ్‌ మించిన రోగం ‘భయం’ వారిని బలితీసుకున్నది. 

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ రియా దవాఖానలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న యాదగిరికి (35) శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. దవాఖానలో పనిచేస్తున్నా.. వేల మంది కరోనాను జయించారని తెలిసినా.. ఆయనను భయం ఆవహించింది. మనస్థాపంతో ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. భార్యను ఒంటరిని చేశారు. మరి ఆమె భవిష్యత్తు ఏంటి? 

 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్సే కాదు.. దానిపై భయం కూడా మనుషులను వెంటాడుతున్నది. ఆ మహమ్మారి కంటే ముందే భయం అనే వ్యాధి చంపేస్తున్నది. యు వకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా వారి గుండెలయను ఆపేస్తున్నది. కొందరు కరోనా సోకినవాళ్లు, సోకిందేమోనన్న అనుమానం ఉన్నవాళ్లు క్షణమొక యుగంలా, దినదిన గండంలా బతుకీడుస్తున్నారు. ఈ భయాన్నే వైద్య పరిభాషలో ‘అగోరాఫోబియా’ అంటారు. కరోనా నుంచి కోలుకోవాల్సిన వాళ్లు కూడా తీవ్ర మానసిక ఆందోళనకు గురై ప్రాణాల మీద కు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో సైకాలజిస్టుల దగ్గరికి వచ్చే ప్రతి పదిమందిలో ఆరేడుగురు కరోనాతో ముడిపడి ఉన్నవారేనట. ‘నేను బతుకుతానా? రోగానికి మందు లేదట కదా? నేను పోతే నా కుటుంబపరిస్థితి ఏంటి?’ అనే ప్రశ్నలు వాళ్ల మెదళ్లను తొలుస్తున్నాయట. భయం పాముకాటు మాదిరేనని సైకాలజిస్టులు చెప్పారు. 

పాముకాటేయగానే, విష ప్రభావం కంటే ముందు.. చనిపోతామేమోనన్న భయం తో గుండెపోటు వచ్చి చనిపోయినవాళ్లే ఎక్కువగా ఉంటారని వివరించారు. అలాగే, వైద్యులు కరోనాకు చికిత్స అందిస్తున్నా బాధితుడిలో మానసిక ఆందోళన ఎక్కువై, అది గుండెపై ప్రభావం చూపుతున్నదని వెల్లడించారు. కడప జర్నలిస్టు విషయంలోనూ ఇదే కనిపించింది. వెంటిలేటర్‌ ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నా తన కు ఊపిరి ఆడటం లేదని చెప్పడం విపరీతమైన మానసిక ఆందోళనేనని విశ్లేషించారు. ఇక కరో నా సోకుతుందేమోననే భయంతో దేశవ్యాప్తం గా అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. నమ్ముకున్న కుటుంబాలను నట్టేట ముంచి అనవసరంగా ప్రాణాలు విడుస్తున్నారు. 

పానిక్‌ అటాక్‌ డిజార్డర్‌ 

ఒక  అంశం గురించి తీవ్ర ఆందోళన చెందు తూ అనారోగ్యానికి గురవడాన్ని వైద్యపరిభాష లో పానిక్‌ అటాక్‌ డిజార్డర్‌ అంటారు. అతి భయం, ఆందోళన వల్ల కొందరిలో రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. విపరీతంగా చమటలు వస్తాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాళ్లు, చేతులు వణికిపోతుంటాయి. చాతినొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరు బీపీ పడిపోయి సొమ్మసిల్లుతారు. ఇది దాదాపు గుండెపో టు వంటిదేనని మానసిక వైద్యులు చెప్తున్నారు. ‘నాకు అర్ధరాత్రి ఒంటిగంటకు ఒక వ్యక్తి ఫోన్‌ చేసి.. నాకు కరోనా వస్తుందేమోనని భయంగా ఉందని, చమటలు పడుతున్నాయని చెప్పారు. ఆయన సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కరోనాకు సంబంధించిన వార్తలు చూశారట. ఎంత మంది చనిపోయారు? దవాఖానలో ఎంత ఖర్చవుతుంది? వార్డుల్లో ఏయే వసతులు ఉంటాయి?. ఇలాంటివి ఆలోచించి పానిక్‌ అ టాక్‌ తెచ్చుకున్నారు. ఇలా రెండుమూడు రోజులకు ఒకరు ఫోన్‌ చేస్తున్నారు’ అని హైదరాబాద్‌కు చెందిన ఓ మానసిక వైద్యురాలు చెప్పారు. 


‘పాజిటివ్‌'ను విస్మరిస్తున్నారు  

చాలామంది కరోనా అంటేనే హడలిపోతూ.. పాజిటివ్‌ అంశాలను విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు సుమారు 75 శాతం ఉన్నది. మరణాల రేటు జాతీయ సగటు 2.4 ఉంటే, తెలంగాణలో 1 శాతం కన్నా తక్కువగా ఉంది. అంటే కొవిడ్‌ సోకినా 99 మంది కోలుకుంటున్నారు. 20 రోజుల పాప నుంచి వందేండ్ల వృద్ధుల వర కు కరోనాను జయించినవారే. ఇంట్లోనే ఉండి కోలుకున్నవారు లక్షల్లో ఉన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ దవాఖానల్లో ఉచితం గా వైద్యం పొందినవారు వేలల్లో ఉన్నారు. పాజిటివ్‌ అంశాలు మీడియాలో విస్తృతంగా వస్తున్నాయి. భయాన్ని పెంచే వార్తలకు బదులు ఇవి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. 

సాధారణ వ్యక్తుల్లోనూ ఇదే ఆందోళన

కరోనా సోకిన వాళ్లే కాదు.. సాధారణ వ్యక్తు లు కూడా కరోనా గురించి అదే పనిగా ఆలోచి స్తూ ఆందోళనకు గురవుతున్నారని మానసిక నిపుణులు వెల్లడించారు. కొందరు విద్యార్థులు కూడా చదువు ఏమవుతుందో? కరోనా ఇంకెం త కాలం? అంటూ ఆలోచిస్తున్నారని తెలిపారు. అలాంటివారికి యోగా, కౌన్సెలింగ్‌, పలకరింపులే సరైన మందని పేర్కొన్నారు. 

కుటుంబమే మందు 

కరోనా గురించి ఎక్కువగా ఆరాతీయడం. కరోనా వార్తలు ఎక్కువగా చూడటం, వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం, చికిత్సకు రూ.లక్షలు అవుతాయనే భయంతో ముందే కూడబెట్టడం వంటి లక్షణాలు మన ఇంట్లోని వ్యక్తుల్లో ఎవరికైనా గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వారు పానిక్‌ అటాక్‌కు దగ్గరగా ఉన్నట్టు నిర్ధారించుకోవాలి. వారిని ఒంటరిగా వదిలేయకుండా ధైర్యం చెప్పాలి. పాజిటివ్‌ వార్తలు చూపించాలి. అవసరమైతే వెంటనే కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లు ధైర్యంగా ఉండాలి. మన ఇంట్లో లేదా పక్క ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే వారిని అసహ్యించుకునే బదులు ధైర్యం చెప్పాలి. 

- డాక్టర్‌ కవిత పాన్యం, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

ఆ నరాల్ని ఉత్తేజపరిస్తేనే బయటపడతారు

సాధారణంగా మనిషికి తనకేదో అయిపోతుందనే భయం మొదలైనపుడు మెదడులో రసాయన చర్యలు మొదలవుతాయి. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతాడు. దాని పర్యవసానం ఏంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత క్రమంగా పెరిగి డిప్రెషన్‌లోకి వెళతాడు. ఈ క్రమంలోనే మెదడులోని పారా సింపథిటిక్‌ నరాలు ఉత్తేజం చెందాలి. సాధారణంగా అవి వాటంతట అవే యాక్టివేట్‌ కావు. ఇందుకోసమే వైద్యులు రకరకాల మార్గాల్ని సూచిస్తారు. ఇందులో భాగంగా యోగా, ప్రాణాయామం చేయిస్తారు. దగ్గరివాళ్లతో మాట్లాడించి సాంత్వన కలిగిస్తారు. అలా నరాలు ఉత్తేజితం అయ్యి సాధారణ స్థితికి వస్తాడు.

- డాక్టర్‌ మోతుకూరి రాంచందర్‌, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు


logo