బుధవారం 03 జూన్ 2020
Telangana - May 08, 2020 , 01:42:11

‘కాళేశ్వరం’తోనే అన్నపూర్ణగా..

‘కాళేశ్వరం’తోనే అన్నపూర్ణగా..

  • వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌
  • అధికారుల బృందంతో కలిసి ‘కాళేశ్వరం’ పర్యటన
  • లక్ష్మి, సరస్వతి, పార్వతి పంపుహౌజ్‌ల సందర్శన
  • మూడో టీఎంసీ తరలింపు పనులపై సమీక్ష

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ అన్నపూర్ణగా మారనున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన రావ డం.. అనుకున్న గడువులోనే నిర్మించడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. గురువారం సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, నీటి పారుదల ఈఎన్సీ మురళీధర్‌, కాళేశ్వరం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, మెగా ఎండీ కృష్ణారెడ్డి, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డితో కలిసి ‘కాళేశ్వరం’ బాటపట్టారు. 

జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం కన్నెపల్లిలోని లక్ష్మి పంపుహౌజ్‌ను సందర్శించి అక్కడినుంచి పెద్దపల్లి జిల్లాలోని సరస్వతి, పార్వతి పంపుహౌజుల్లో కొనసాగుతున్న మూడో టీఎంసీ తరలింపు పనులను పరిశీలించారు. లక్ష్మి పంప్‌హౌజ్‌ నిర్మాణం, విశిష్ఠతను కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు మంత్రి బృందానికి వివరించా రు. అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ.. తెలంగాణకే తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో అనుకున్న గడువులోనే నిర్మించి సీఎం కేసీఆర్‌ రికార్డు సృష్టించారని కొనియాడారు. ఈ ప్రాజెక్టులో అతి ముఖ్యమైంది లక్ష్మి పంప్‌హౌజ్‌ అని.. ఇక్కడినుంచే అన్ని బ్యారేజీలకు నీటిని ఎత్తిపోస్తారని చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన పనులను గడువు ముగియగానే వేగవంతం చేయనున్నట్లు వివరించారు. ఆగస్టు నాటికి 3వ టీఎంసీ నీరు ఎత్తి పోసే పనులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు.  

వానకాలంలో 3టీఎంసీలు ఎత్తిపోయాలి

రాబోయే వానకాలం సీజన్‌లోగా ‘కాళేశ్వరం’ లింక్‌-1 నుంచి మూడు టీఎంసీల జలాలను ఎత్తిపోసేలా పనులన్ని పూర్తిచేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. లక్ష్మి, సరస్వతి పంపుహౌజ్‌లను పరిశీలించిన మంత్రి అనంతరం పార్వతి పంపుహౌస్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా అదనపు టీఎంసీని తరలించేలా నిర్మాణ పనులను వేగంగా పూర్తి చే యాలని చెప్పారు. మూడో టీఎంసీ తరలింపునకు అవసరమైన పంపులు, మోటర్లను విదేశాల నుంచి తెచ్చుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. జూన్‌ 15వరకు రెండు పంపులు, జూలై 15వరకు మిగతా నాలుగు పంపుల బిగింపు పనులు పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. గోదావరిలో ప్రవాహం మొదలయ్యేలోగా పనులు పూర్తిచేసి, ఎత్తిపోతలకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. మూడో టీఎంసీ తరలింపు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ రోజూ సమీక్షిస్తున్నారని, పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. 


logo