శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 15:09:30

అగ్రి చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిద్దాం.. రైతుల‌ను రాజుల‌ను చేద్దాం..

అగ్రి చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిద్దాం.. రైతుల‌ను రాజుల‌ను చేద్దాం..

వ‌రంగ‌ల్ : పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జాతర కొన‌సాగుతుంద‌ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్ప‌ష్టం చేశారు. అగ్రి చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించి రైతుల‌ను రాజుల‌ను చేద్దామ‌ని మంత్రి పిలుపునిచ్చారు. తొర్రూరు మండలంలో ప‌ర్య‌టించిన మంత్రి ద‌యాక‌ర్‌రావుకు ఆయా గ్రామాల ప్ర‌జ‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.  శ‌నివారం తొర్రూరు మండ‌లంలో రూ. 2.32 కోట్ల విలువైన అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. నాంచారి మడూరులో రూ. 22 ల‌క్ష‌ల‌తో నిర్మించిన రైతు వేదిక‌ను, పెద్ద మంగ్యా తండాలో రూ.12 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని మంత్రి ప్రారంభించారు. ఇదే తండాలో రూ.20 ల‌క్ష‌ల‌తో చేప‌ట్టిన గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నానికి, కొమ్మ‌నప‌ల్లి తండాలో రూ. 20 ల‌క్ష‌ల‌తో చేప‌ట్టిన గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నానికి భూమి పూజ చేసి, శంకు స్థాప‌న చేశారు. అనంత‌రం రూ.22 ల‌క్ష‌ల‌తో నిర్మించిన మ‌రో రైతు వేదిక‌ను ప్రారంభించారు. అమ్మాపురంలో రూ.16 ల‌క్ష‌ల వ్య‌యంతో చేప‌ట్టిన ప్రాథ‌మిక ఆరోగ్య ఉప‌ కేంద్ర భ‌వ‌నానికి భూమి పూజ చేసి, శంకుస్థాప‌న చేసిన అనంత‌రం, ఇదే గ్రామంలో రూ.22 ల‌క్ష‌ల‌తో పూర్తి చేసిన రైతు వేదిక‌ను ప్రారంభించారు. అనంత‌రం తొర్రూరు మండ‌ల కేంద్రంలో రూ.22 ల‌క్ష‌ల‌తో నిర్మించిన రైతు వేదిక‌ను ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్రారంభించారు. 


అనంత‌రం తొర్రూరు మండ‌లం కంఠాయ‌పాలెంలో రూ. 22 ల‌క్ష‌ల‌తో నిర్మాణం పూర్తి చేసిన రైతు వేదిక‌ను, రూ.12 ల‌క్ష‌ల‌తో నిర్మించిన వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. అలాగే సోమార‌పు కుంట తండాలో రూ.20ల‌క్ష‌ల‌తో చేప‌ట్టిన గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నానికి భూమి పూజ చేసి, శంకు స్థాప‌న చేశారు. ఇదే మండ‌లం మాటేడు గ్రామంలో రూ.22 ల‌క్ష‌ల‌తో పూర్తి చేసిన రైతు వేదిక‌ను ప్రారంభించారు.  

ఈ సంద‌ర్బంగా మంత్రి ద‌యాక‌ర్‌రావు మాట్లాడుతూ.. ఇది ప్రజా సంక్షేమ, అభివృద్ధి కాముక ప్రభుత్వం అని స్ప‌ష్టం చేశారు. రైతు రాజ్యం రావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్య‌మ‌ని ఉద్ఘాటించారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ ప్రోత్సాహక పథకాలు క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. కొత్త సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు చెప్పారు. రైతు ప‌క్ష‌పాతి సీఎం కేసీఆర్‌ను రైతులంద‌రూ స‌మ‌ర్ధించాల‌న్నారు. అగ్రి చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించి రైతుల‌ను రాజుల‌ను చేద్దామ‌ని మంత్రి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు.