గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 15:42:28

తాగునీటి స‌ర‌ఫ‌రాలో తెలంగాణ బెస్ట్ : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

తాగునీటి స‌ర‌ఫ‌రాలో తెలంగాణ బెస్ట్ : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

హైద‌రాబాద్ : ప‌్ర‌జ‌ల‌కు సుర‌క్షిత మంచినీరు స‌ర‌ఫ‌రా చేయడంలో తెలంగాణ రాష్ర్టం దేశంలోనే నంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌ని రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కంపై ఎర్ర‌మంజిల్‌లోని ఈఎన్సీ కార్యాల‌యంలో మంత్రి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకాన్ని రూ. 46 వేల 123 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టామ‌ని తెలిపారు. ఇందులో 80 శాతం నిధులను హడ్కో, నాబార్డులతో పాటు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించామ‌ని చెప్పారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం ఇప్పటికి రూ. 33 వేల 400 కోట్లు ఖర్చు పెట్టామ‌ని గుర్తు చేశారు. రూ. 38 వేల కోట్లతోనే ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే జరిగితే మిషన్ భగీరథ కోసం పరిపాలన అమనుతి ఇచ్చిన మొత్తంలో 8 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి అని మంత్రి తెలిపారు. 

23,787 ఆవాసాల‌కు తాగునీరు

మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో 23 వేల 787 ఆవాసాలకు సుర‌క్షిత మంచినీరు అందిస్తున్నామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. మరో 188 ఆవాసాలకు కూడా నీటిని అందించే ప్రక్రియ మొదలు పెట్టామ‌ని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 18 వేల 175 వాటర్ ట్యాంకులలో, ఇప్పటికి 18 వేల 76  పూర్తయ్యాయి. మిగిలిన 99 ట్యాంకులు కూడా నవంబర్ 30 వరకు పూర్తవుతాయి. మొత్తం 124 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా మిషన్ భగీరథ నీరు అందుతోంది అని మంత్రి చెప్పారు. సమర్ధ వంతంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా “స్టెబిలైజేషన్” కార్యక్రమం కూడా జరుగుతుంది అని తెలిపారు. 

ప్ర‌భుత్వ చొర‌వ‌ను అభినందించిన మోదీ

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని గజ్వేల్ సెగ్మెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2016, ఆగస్టు 7న ప్రారంభించారు అని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. తాగునీటి సరఫరాలో తెలంగాణ ప్రభుత్వం చొరవను మోదీ అభినందించార‌ని గుర్తు చేశారు. 2016 మే 22 నాటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ప్రజల‌కు సురక్షిత మంచినీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న‌ ప్రయత్నాన్ని మోదీ ప్రశంసించారు అని పేర్కొన్నారు. 

మిష‌న్ భ‌గీర‌థ‌కు మూడు సార్లు అవార్డులు

మిషన్ భగీరథ పథకం మౌళిక సదుపాయాల కల్పనలో వినూత్న పథకం అని ప్రశంసిస్తూ హడ్కో 3 సార్లు అవార్డు అందించింది అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ తెలిపారు. నీటి వినియోగ సామర్ధ్యం 20 శాతం పెంచినందుకు, జాతీయ వాటర్ మిషన్-2019లో మిషన్ భగీరథకు మొదటి బహుమతి ఇచ్చింది. ఈ పథకానికి ఆన్ లైన్ పర్యవేక్షణకు 2018 లో స్కాచ్ అవార్డు లభించింది. ప్రధానమంత్రి, నీతి అయోగ్, 15వ ఆర్థిక సంఘం తో పాటు పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, రాష్ట్రాల ప్రతినిధులు మిషన్ భగీరథ పథకాన్ని స్వయంగా పరిశీలించి ప్రశంసలు కురిపించారు. దీన్ని గొప్ప పథకంగా సాక్షాత్తు ప్రధానమంత్రి అభినందించడమేగాదు, దేశంలో జల్ శక్తి మిషన్ ద్వారా ఇదే తరహాలో చేట్టడానికి కేంద్రం నిర్ణయించింది అని మంత్రి పేర్కొన్నారు.

నిధుల విష‌యంలో కేంద్రంలో క‌ద‌లిక లేదు

మిషన్ భగీరథ పథకానికి నిధులివ్వాలని సీఎం కేసీఆర్, మంత్రిగా నేను, రాష్ట్రం ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరామ‌ని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు గుర్తు చేశారు. మిషన్ భగీరథ పథకానికి రూ. 19 వేల కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి కదలిక‌ లేదు. మిషన్ భగీరథ నిర్వహణకు ప్రతి ఏటా రూ. 2 వేల 110 కోట్లు అవసరమవుతాయి. కనీసం ఈ నిర్వహణా ఖర్చులనైనా ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. దీనిపై స్పందన లేదు అని మంత్రి తెలిపారు. 

మిష‌న్ భ‌గీర‌థ స్ఫూర్తితో జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌

మన మిషన్ భగీరథ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కూడా 'జల్ జీవన్ మిషన్'ను పథకాన్ని రూపొందించింది అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. దానికి కావాల్సిన టెక్నాలజీని ఇంజనీరింగ్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు మన రాష్ట్రానికి ఎన్నోసార్లు వచ్చి స్టడీ చేయడం జరిగింది. ఇంటింటికి నీళ్లు ఇచ్చే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇటీవల ఇచ్చిన ర్యాంకింగ్ లో 98 శాతంతో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. కేంద్రం సహా, అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ పథకాన్నే వేర్వేరు పేర్లతో దాదాపు యథాతథంగా అమలు చేస్తున్న మన పథకంపై, మన రాష్ట్రంపై కేంద్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో కేంద్రం చెప్పాలి అని ద‌యాక‌ర్ రావు డిమాండ్ చేశారు.