ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 16:08:26

కాక‌తీయుల‌ను మించిన మ‌హానుభావుడు కేసీఆర్ : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

కాక‌తీయుల‌ను మించిన మ‌హానుభావుడు కేసీఆర్ : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

జ‌న‌గామ : ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుపై పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కాక‌తీయ రాజుల‌ను మించిన మ‌హానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. మ‌నంద‌రం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి. రైతుల జీవితాల్లో కేసీఆర్ మార్పు తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్ ద‌య‌వ‌ల్ల పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి సాగునీరు వ‌చ్చింది అని ద‌యాక‌ర్‌రావు తెలిపారు. జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల రైతు వేదిక ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప్ర‌సంగించారు. ఉమ్మ‌డి ఏపీలో జ‌న‌గామ జిల్లా అంతా క‌రువు ప్రాంతం. కొత్త‌గా ఎమ్మెల్యే అయిన‌ప్పుడు చెరువుల‌, కాల్వ‌లు, ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు. ఎస్సారెస్పీ ఎండిపోయి మురికి తుమ్మ‌ చెట్లు మొలిచాయి. దేవాదుల పూర్తి కాలేదు. ఇవాళ కేసీఆర్ నాయ‌క‌త్వంలో దేవాదుల పూర్తి చేసుకుని చెరువుల‌ను నింపుకున్నాం. ఎస్సారెస్పీ కాల్వ‌కు నీళ్లు వ‌స్తున్నాయి. వ్య‌వ‌సాయం దండిగా చేసుకుంటున్నాం. రైతుల ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్. రైతు పేరు చెప్పుకుని గ‌తంలో అధికారంలోకి వ‌చ్చారు. కానీ రైతుల‌కు గ‌త ప్ర‌భుత్వాలు చేసిందేమీ లేదు. సాగునీరు, విద్యుత్ కోసం ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాం. ఇప్పుడు ఆ ఇబ్బందులేవీ లేవు అని ద‌యాక‌ర్ రావు పేర్కొన్నారు.