గురువారం 04 జూన్ 2020
Telangana - May 09, 2020 , 12:00:08

కేసీఆర్‌ లాంటి సీఎంను చూడలేదు : మంత్రి ఎర్రబెల్లి

కేసీఆర్‌ లాంటి సీఎంను చూడలేదు : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌ : నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక మంది సీఎంలను చూశాను.. కానీ కేసీఆర్‌ లాంటి సీఎంను చూడలేదు. కేసీఆర్‌ అభివృద్ధిని సైతం ఉద్యమ స్ఫూర్తితో నిర్వర్తిస్తున్నారని, తెలంగాణను దేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో కేసీఆర్‌ చిత్రపటానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.

కరోనా లాక్‌డౌన్‌ కాలంలోనూ సీఎం కేసీఆర్‌ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసర సరుకులు అందించి ధరలను అదుపులో ఉంచారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, ప్రతి రేషన్‌కార్డుకు రూ. 1500ల చొప్పున ఆర్థిక సాయం అందించారని మంత్రి గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిందని తెలిపారు. రైతు పండించిన ఆఖరు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 

రూ. 25 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ ఒకేసారి మాఫీ చేయడానికి రూ. 1200 కోట్లు విడుదల చేశారని తెలిపారు. రైతుబంధు పథకం కింద రూ. 7 వేల కోట్లు, కూలీలకు ఉపాధి కల్పించడానికి రూ. 170 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ. 370 కోట్లు సీఎం కేసీఆర్‌ విడుదల చేశారని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిపారు. 


logo