సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 11:31:34

ప‌ల్లె ప్ర‌గ‌తితో విష జ్వ‌రాలు త‌గ్గించ‌గ‌లిగాం : మంత్రి ఎర్ర‌బెల్లి

ప‌ల్లె ప్ర‌గ‌తితో విష జ్వ‌రాలు త‌గ్గించ‌గ‌లిగాం : మంత్రి ఎర్ర‌బెల్లి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో విష జ్వ‌రాల‌ను తగ్గించ‌గ‌లిగామ‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా తండాలు, గిరిజ‌న‌ గ్రామ పంచాయ‌తీల అభివృద్ధిపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్ గిరిజ‌న తండాల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా గుర్తించారు. ఏండ్ల త‌ర‌బ‌డి ఉన్న‌ ఎస్టీల క‌ల‌ల‌ను సీఎం సాకారం చేశారు. గిరిజ‌నుల‌కు ఆరాధ్య దైవంగా కేసీఆర్ ఉన్నారు. తండాల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా గుర్తించిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. కొత్త‌గా 4,383 గ్రామపంచాయ‌తీలు ఏర్ప‌డ్డాయి. 1,827 కొత్త గిరిజ‌న పంచాయ‌తీలు ఏర్ప‌డ్డాయి. పూర్తి ఎస్టీ జ‌నాభా ఉన్న గ్రామ పంచాయతీలు 1,177 అని మంత్రి తెలిపారు. ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ద్వారా గ్రామాల‌ను అభివృద్ధి చేసుకుంటున్నాం. జ‌నాభా త‌క్కువ ఉన్న‌ ప్ర‌తి గ్రామానికి రూ. 5 ల‌క్ష‌లు ఇస్తున్నామ‌ని చెప్పారు.

40 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల‌కు రూ. 5వేల చొప్పున ప్రోత్స‌హ‌కం రెండు నెల‌ల పాటు ఇచ్చామ‌న్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. ప్ర‌తి గ్రామంలో వైకుంఠ‌ధామం, డంపింగ్ యార్డ్‌తో పాటు ట్రాక్ట‌ర్ ఇచ్చామ‌న్నారు. ప్ర‌తి గ్రామంలో న‌ర్స‌రీల‌ను ఏర్పాటు చేసి.. రైతుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే మొక్క‌ల‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. విష జ్వ‌రాల బారిన ప‌డ‌కుండా గ్రామాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేస్తున్నామ‌ని తెలిపారు. పల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంతో విష జ్వ‌రాల‌ను త‌గ్గించ‌గ‌లిగామ‌ని చెప్పారు. గ్రామ పంచాయ‌తీల‌కు ప్ర‌తి నెల 300 కోట్ల గ్రాంట్‌ను స‌మ‌కూర్చుతుంది. ఈ ఏడాది గ్రామ పంచాయ‌తీల‌కు 1847 కోట్ల 50 ల‌క్ష‌లు విడుద‌ల చేయ‌డం జ‌రిగింది అని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు.


logo