బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 11:11:27

ప‌త్తిలో తేమ 12 శాతానికి మించ‌కూడ‌దు : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

ప‌త్తిలో తేమ 12 శాతానికి మించ‌కూడ‌దు : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ ఎనుమాముల మార్కెట్ లో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప‌త్తి కొనుగోళ్ల‌ను గురువారం ఉద‌యం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మ‌డి జిల్లాలో నోటిఫై చేసిన 22 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి, ఈ రోజు నుంచి సిసిఐ ద్వారా కొనుగోలు ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు. రైతులు సీసీఐ నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో ప‌త్తిని మార్కెట్‌కు తీసుకురావాల‌ని సూచించారు. ప‌త్తిలో తేమ నిర్ణీత స్థాయిలో 12 శాతానికి మించ‌కుండా ఉండే విధంగా చూసుకోవాల‌న్నారు. ప‌త్తిని బాగా ఆర‌బెట్టి మార్కెట్‌కు తీసుకురావాల‌ని చెప్పారు. ఆఖ‌రు ప‌త్తి వ‌ర‌కు రైతుల నుంచి ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ప‌త్తి కొనుగోలు కేంద్రాల వ‌ద్ద రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని సూచించారు.  


వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలో 7ల‌క్ష‌ల 58వేల 560 ఎక‌రాల విస్తీర్ణంలో ప‌త్తి పండింది. ప‌త్తి దిగుబ‌డి అంచ‌నా 6ల‌క్ష‌ల 25వేల 285 మెట్రిక్ ట‌న్నులు అని తెలిపారు. గ‌త ఏడాది సిసిఐ కేంద్రాలు 18 కాగా, ఈ ఏడాది 28 కేంద్రాల ద్వారా ప‌త్తి కొనుగోలు చేస్తున్నామ‌ని చెప్పారు. అందుబాటులో 30 జిన్నింగ్ మిల్లులున్నాయి. ఎనుమాముల‌లో 19ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బ‌స్తాల‌ను నిలువ చేసే వీలుంది అని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందం, కార్పొరేటర్లు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సిసిఐ, మార్కెట్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.