ఆదివారం 31 మే 2020
Telangana - May 17, 2020 , 02:01:23

మంచి నీళ్లురాని గల్లీ ఉండొద్దు!

మంచి నీళ్లురాని గల్లీ ఉండొద్దు!

  • నిరంతరం పర్యవేక్షించాలి: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మంచినీళ్లు అందడం లేదన్న ఊరు, గల్లీ ఉండొద్దని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ కారణంగా పెండింగ్‌ పనులేవైనా ఉంటే సత్వరమే పూర్తిచేయాలని సూచించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలన్నారు. శనివారం హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి మిషన్‌ భగీరథ మంచినీటి సరఫరాపై అన్ని జిల్లాల ఎస్‌ఈలు, ఈఈలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని 23,968 గ్రామా లు, ఆవాసాలకు 100 శాతం మంచినీటిని అందిస్తున్నామని, 55,59,172 ఇండ్లకు నీళ్లు చేరుతున్నాయని చెప్పారు. 19 ఇన్‌టేక్‌ వెల్స్‌, 50 నీటి శుద్ధికేంద్రాలు, 1163 సర్వీసు రిజర్వాయర్లు, 441 సంపులు, ఇతర మౌలికసదుపాయాలు కలిగిన మంచినీటి వ్యవస్థ మనకు ఉన్నదని తెలిపారు. 46 వేల కిలోమీటర్ల మేర మంచినీటి పైపులైన్‌ వ్యవస్థ తెలంగాణకు తప్పదేశంలో ఏ రాష్ర్టానికీ లేదని అన్నారు.  


logo