శనివారం 11 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 21:22:41

నిర్ణీత ల‌క్ష్యాల మొక్క‌లు నాటే వ‌ర‌కు విశ్ర‌మించం

నిర్ణీత ల‌క్ష్యాల మొక్క‌లు నాటే వ‌ర‌కు విశ్ర‌మించం

వ‌రంగ‌ల్‌  :  6వ విడ‌త తెలంగాణ‌కు హ‌రిత హారం కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాలి. నిర్ణీత ల‌క్ష్యాలు సాధించే వ‌ర‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు విశ్రమించ‌వ‌ద్దు. నూటికి నూరు శాతం మొక్కలు నాట‌డ‌మే కాదు. నూటికి నూరు శాతం ఆ మొక్కల‌ను మ‌నుగ‌డ సాగించేలా చ‌ర్యలు తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు, అధికారుల‌ను, ప్రజ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ, స‌మ‌న్వయంతో హ‌రిత హారం ని స‌క్సెస్ చేయాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర గిరిజ‌న సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్యవ‌తి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్కర్ తో క‌లిసి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, క‌లెక్ట‌ర్లు, ఇత‌ర అన్ని శాఖల అధికారుల‌తో వ‌రంగ‌ల్ అర్బన్, వ‌రంగల్ రూర‌ల్ జిల్లాల్లో హ‌రిత హారం, ఉపాధి హామీ కార్యక్రమాల అమ‌లు పై స‌మీక్షించారు. హ‌న్మకొండ హంట‌ర్ రోడ్ లోని సిఎస్ ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఈ స‌మీక్షలో మంత్రుల‌తోపాటు, వ‌రంగ‌ల్ అర్భన్ జిల్లా జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, రూర‌ల్ జిల్లా జెడ్పీ చైర్ ప‌ర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీలు బండా ప్రకాశ్, ప‌సునూరి ద‌యాక‌ర్, వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, పెద్ది సుద‌ర్శన్ రెడ్డి, అరూరి ర‌మేశ్, న‌న్నప‌నేని న‌రేంద‌ర్, గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి, డాక్టర్ టి రాజ‌య్య‌, ఒడితెల స‌తీశ్, కుడా చైర్మన్ మ‌ర్రి యాద‌వ‌రెడ్డి, రెండు జిల్లాల‌ క‌లెక్టర్లు రాజీవ్ గాంధీ హ‌న్మంతు, హ‌రిత‌, వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్  అట‌వీ, ఇత‌ర అన్ని శాఖ‌ల అధికారులు ఈ స‌మీక్షలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్యవ‌తి రాథోడ్ లు మాట్లాడుతూ, 6వ విడ‌త తెలంగాణ‌కు హ‌రిత హారం విజ‌య‌వంత‌మే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని అధికారుల‌కు ఉద్బోధించారు. నిర్ణీత ల‌క్ష్యాల మేర‌కు మొక్క‌లు నాటే వ‌ర‌కు విశ్రమించ వ‌ద్దన్నారు. ప్రజాప్రతినిధుల స‌హ‌కారంతో, ప్రజ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని సూచించారు. విరివిగా మొక్కలు నాట‌డ‌మే కాదు, వాటిని బ‌తికించే చ‌ర్యలు కూడా చేప‌ట్టాల‌న్నారు. అందుకు వీలుగా పెద్ద పెద్ద మొక్కల‌నే నాటాల‌ని, త‌ద్వారా ఆయా మొక్కలు మ‌నుగ‌డ సాధించ‌డం సాధ్యప‌డుతుంద‌న్నారు. అధికారులు స‌మ‌న్వయంతో స‌క్సెస్ సాధించాలని సూచించారు. ప్రతి సారీ సీఎం కెసిఆర్ చెబుతున్నట్లుగా హ‌రిత హారం కార్యక్రమం ద్వారా ఊళ్లకు వ‌చ్చిన కోతులు వాప‌స్ పోవాల‌ని, అలాగే, వ‌ర్షాలు తిరిగి రావాల‌ని అన్నారు. ఇదే నినాదంతో ఇక ఈ సారి మంకీ ఫుడ్ కోర్టుల‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని మంత్రులు అధికారుల‌కు చెప్పారు. మంకీ ఫుడ్ కోర్టుల‌కు చెరువుల శిఖాలు, గుట్టలను, దేవాల‌య భూముల‌ను వినియోగించాల‌ని సూచించారు. అలాగే రొటీన్ ప‌ద్ధతి కాకుండా, బాగా స‌క్సెస్ అయిన యాదాద్రి త‌ర‌హా ప్లాంటేష‌న్ ను చేప‌ట్టాలని అధికారుల‌కు మంత్రులు ఎర్రబెల్లి, స‌త్యవ‌తిలు సూచించారు.

కాగా, ఈ ఏడాది వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లా ల‌క్ష్యం 23.78ల‌క్ష్యల మొక్కలు నాట‌డ‌మ‌ని, అలాగే వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ల‌క్ష్యం 57.62 ల‌క్షల మొక్కలుగా నిర్ణయించార‌ని, వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ ఆధీనంలో 36 ల‌క్షల మొక్కలు నాటాల‌ని ల‌క్ష్యంగా నిర్ణయించార‌ని మంత్రిలు వివ‌రించారు. 6వ విడ‌త హ‌రిత హారం వ‌రంగ‌ల్ అట‌వీ శాఖ ల‌క్ష్యం కేవ‌లం 50వేల మొక్కలు మాత్రమే, కాగా, అట‌వీ ప్రాంతంలో ఇప్పటిదాకా చేప‌ట్టిన హ‌రిత హారంలో నాటిన మొక్కలు చాలా వ‌ర‌కు వేళ్ళూనుకున్న కార‌ణంగా, త‌క్కువ మొక్కలు నాటడానికి మాత్రమే స్థలం ఉంద‌ని మంత్రులు అన్నారు.

య‌థావిధిగా ప‌ట్టణ ప్రగ‌తి, ప‌ల్లె ప్రగ‌తి కార్యర్రమాల కొన‌సాగింపు

య‌థావిధిగా ప‌ట్టణ‌, ప‌ల్లె ప్రగ‌తి కార్యక్రమాలు నిర్వహించాల‌ని మంత్రులు అధికారుల‌కు తెలిపారు. ప‌చ్చద‌నం-పారిశుద్ధ్యం కార్యక్రమాల‌ను కొన‌సాగించాల‌న్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ రెండు కార్యక్రమాలు నిర్యహించ‌డం ద్వారా మాత్రమే క‌రోనాని కంట్రోల్ చేయ‌గ‌ల‌మ‌న్నారు. క‌రోనా విష‌యంలోనూ ఎవ‌రికి వారే అప్రమ‌త్తంగా ఉండాల‌ని, ప్రజ‌లంతా ఈ విష‌యాల‌ను గుర్తించాల‌న్నారు.  ఇక ఇప్పటి నుంచి పోడు భూముల్లో, కెనాల్ ల‌కు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేప‌ట్టాల‌నే ప్రతిపాద‌న‌ను న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్ రెడ్డి తీసుకు వ‌చ్చారు. అవీ పండ్ల మొక్కల‌నే నాటాల‌ని ఆయ‌న తెలిపారు. దీంతో మంత్రుల‌తోపాటు, అంతా క‌లిసి ఈ ప్రతిపాద‌న బాగుంద‌ని అన్నారు. ఇక ఉపాధి హామీ ప‌నులను అత్యంత వేగంగా పూర్తి చేయాల‌ని, అనుసంధానించిన శాఖ‌ల ప‌నులు త‌ప్పనిస‌రిగా జ‌రిగేట్లు చూడాల‌ని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌కు తెలిపారు. క‌ల్లాల నిర్మాణం స‌హా అనేక ప‌నుల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఈ సారి నిర్వహించే ప‌నులు పూర్తి చేస్తే, వ‌చ్చే ఏడాదికి మూడు రెట్లు అద‌నంగా ప‌నులు మంజూర‌వుతాయ‌ని, దీనికి త‌గ్గట్లుగా అధికారులు వ్యవ‌హ‌రించాల‌ని మంత్రి అధికారుల‌కు తెలిపారు.  ఈ సంద‌ర్భంగా మంత్రులు హ‌రిత హారం వాల్ పోస్ట‌ర్ల‌ని, మాస్కుల‌ని, బ్రోచ‌ర్ల‌ని విడుద‌ల చేశారు.


logo