గురువారం 04 జూన్ 2020
Telangana - May 10, 2020 , 19:02:14

సామాజిక ఉద్య‌మంగా ప్ర‌తి ఆదివారం-ప‌ది నిమిషాల కార్య‌క్రమం

సామాజిక ఉద్య‌మంగా ప్ర‌తి ఆదివారం-ప‌ది నిమిషాల కార్య‌క్రమం

హైదరాబాద్‌: సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలక, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి  కేటీఆర్‌  చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పది నిమిషాలు” కార్య‌క్ర‌మంలో  రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ  మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాల్గొన్నారు. హైద‌రాబాద్‌లోని  మంత్రుల ఆవాసంలోని   త‌న నివాసంలోని పూల కుండీలలో చెత్తను, నిల్వ నీటిని తొలగించి, తాజా నీటితో నింపారు.   ప్ర‌తి ఆదివారం-పది గంట‌ల‌కు-ప‌ది నిమిషాలు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన  మంత్రి కేటీఆర్‌ను  మంత్రి ఎర్ర‌బెల్లి అభినందించారు.    

ప్ర‌తి ఆదివారం-ప‌ది గంట‌ల‌కు-ప‌ది నిమిషాల కార్యక్ర‌మం సామాజిక బాధ్య‌త‌గా, ఓ సామాజిక కార్య‌క్ర‌మంగా ప్ర‌తి ఒక్క‌రూ నిర్వ‌హించాల‌ని మంత్రి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను కూడా ప్ర‌జ‌లు పాటించాల‌ని మంత్రి సూచించారు. ఇటీవ‌లి కాలంలో దోమ‌ల వ‌ల్లే ఎక్కువ వ్యాధులు వ‌స్తున్నాయ‌న్నారు. మ‌లేరియా, డెంగీ, చికున్ గున్యా, మెద‌డు వాపు, బోద‌కాలు వంటి వ్యాధులు ప్ర‌బ‌లుతున్నాయ‌న్నారు. నీటి నిల్వ‌లు లేకుండా చూసుకోవ‌డం, వాటిపై మూతలు ఉండేలా చేయ‌డం,  మ‌రుగుదొడ్లు, నీటి తొట్టెలు, సంపులు, డ్ర‌మ్ములు శుభ్రంగా ఉండేలా చూసుకోవ‌డం కొత్తేమీ కాదు, కానీ, వాటిని మ‌నం మ‌ర‌చిపోతున్నామ‌న్నారు. 

మ‌న సంస్కృతీ, సంప్ర‌దాయాల‌ను పాటించినా, మ‌న‌కు ఆరోగ్య‌మేనన్నారు. కేటీఆర్‌ ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మం నిరంత‌రం జ‌రిగేలా చూడాల‌ని, ఎవ‌రికి వారు పాటించాల‌ని కోరారు.  త‌ద్వారా ఎవ‌రికి వారు త‌మ కుటుంబాల‌ని, ప‌రిస‌రాల‌ను, మొత్తం స‌మాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ప‌రిశుభ్రంగా, రోగాల ర‌హిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కేసీఆర్‌ ఆలోచ‌నా విధానంలో  కేటీఆర్‌ రూపొందించిన ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌లంతా మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి   పిలుపునిచ్చారు.


logo