బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 02:20:11

ప్రగతి పథం

ప్రగతి పథం
  • పదో రోజు ముమ్మరంగా పనులు
  • పరిశుభ్రంగా పట్టణాలు, నగరాలు
  • పలుజిల్లాల్లో మంత్రుల విస్తృత ప్రచారం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలు, నగరాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. పదో రోజైన బుధవారం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో కలియతిరుగుతూ ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, గంగుల కమలాకర్‌ ఆయా జిల్లాల్లో ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ను విధుల నుంచి తప్పించగా, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపల్‌ సిబ్బంది ముగ్గురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.


సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. గజ్వేల్‌కు త్వరలోనే కాళేశ్వరం నీళ్లు వస్తాయని, ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సాగునీటి కొరత తీరనున్నదని చెప్పారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేటలో పట్టణ ప్రగతిపై జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. ప్రభుత్వం ఇప్పటికే అన్ని పట్టణాల అభివృద్ధికి రూ.20 కోట్ల చొప్పున కేటాయించారని గుర్తుచేశారు. 


అనంతరం పలు వార్డుల్లో డ్రైనేజీలను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలువార్డుల్లో పట్టణ ప్రగతిలో పాల్గొన్న విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మొక్కలు నాటి, ఇంటిపంటపై అవగాహన కల్పించారు. అలాగే పెన్‌పహడ్‌ మండలంలో గ్రామ పంచాయతీలకు నూతన ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఖమ్మం నగరంతోపాటు సత్తుపల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో సైకిల్‌పై తిరుగుతూ పనులను పర్యవేక్షించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 23, 46 డివిజన్లలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో సుమారు రూ.10కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్ల్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి పర్యటించారు. పట్టణాలను గ్రీన్‌సిటీలకు మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని తెలిపారు.  


జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌పై చర్యలు

పట్టణ ప్రగతిలో నిర్లక్ష్యం వహించిన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ను కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు విధుల నుంచి తప్పించారు. కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అరుణకుమారిని పురపాలన శాఖ అధికారి కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశిస్తూ జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావుకు కమిషనర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.  పట్టణ ప్రగతిలో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు మున్సిపల్‌ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్లు మున్సిపల్‌ ప్రత్యేకాధికారి వీరయ్య తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయ మేనేజర్‌ మల్లారెడ్డి, మెప్మా సీవో శంకర్‌, ట్రైసైకిల్స్‌ ఇంచార్జి కిషన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కలెక్టర్‌ భారతి హోళీకేరి ఆదేశాల మేరకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. 


logo