గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 01:43:39

అడ్డగోలుగా మాట్లాడితే ఉర్కిచ్చి కొడ్తరు

అడ్డగోలుగా మాట్లాడితే ఉర్కిచ్చి కొడ్తరు
  • కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి కౌంటర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అసెంబ్లీలో శనివారం కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పించారని, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల్లేవని, సర్కార్‌ దవాఖానల్లో పరిస్థితి అధ్వానంగా ఉన్నదని, అంత ఎక్కువ ఖర్చుచేసి యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మించాల్సిన పనిలేదని, కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ.. పాలమూరు-రంగారెడ్డిపై లేదని కోమటిరెడ్డి ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి.. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని, ఆయన ప్రజల్లో తిరుగుతున్నాడో.. రోడ్లపై తిరుగుతున్నాడో అర్థంకావడం లేదన్నారు. 


‘నా తోరా.. ఏ జిల్లాకంటే ఆ జిల్లాకు పోదాం.. ఇవే మాటలు అక్కడ మాట్లాడితే జనం నిన్ను ఉర్కిచ్చి కొడతరు..’ అని ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతకుముందు డబ్బులిచ్చి ఎన్నికల్లో గెలుస్తున్నారంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను శాసనసభ వ్యవహారాలమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఖండించారు. అన్ని ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరథం పడుతుంటే.. ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను కించపర్చేలా కోమటిరెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెనక్కితగ్గిన కోమటిరెడ్డి ఉద్యమనాయకుడిగా తెలంగాణరాష్ట్రం సాధించిన కేసీఆర్‌ సీఎంగా పనిచేస్తుండటం తమకు సంతోషంగాఉన్నదని అన్నారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై నిందలు వేయాలన్న ఉద్దేశం తనకులేదని, కేసీఆర్‌ను కుటుంబసభ్యుడిగా భావిస్తామని చెప్పారు.


logo