సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:59

కష్టాల్లో దిగజారుడు రాజకీయాలా?

కష్టాల్లో దిగజారుడు రాజకీయాలా?

  • బీజేపీ ఎంపీ అరవింద్‌పై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఆ పార్టీ ఎంపీ అర్వింద్‌ వరంగల్‌కు వచ్చి ఉద్దేశపూర్వకంగానే వివాదాలు సృష్టిస్తున్నారని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ఒక ఎంపీ అనే విషయం మరచిపోయి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై నిరాధార విమర్శలు చేస్తూ బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయాలు చేసే సమయమా? లేక ప్రజలను ఆదుకునే సమయమా? బీజేపీ సిద్ధాంతాలు ఇవేనా అని ప్రశ్నించారు. చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌ క్యాంప్‌ కార్యాలయంపై బీజేపీ దాడి అప్రజాస్వామికమని అన్నారు. 

మాజీ ఎంపీ కవిత, చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలను బేషరతుగా విరమించుకోవాలని డిమాండ్‌చేశారు. నిజామాబాద్‌లో అర్వింద్‌ ఎలా గెలిచారో ప్రజలకు తెలుసని.. ప్రవర్తన గౌరవప్రదంగా ఉండాలని హితవు పలికారు. పెద్దవాళ్లను విమర్శిస్తే రాజకీయాల్లో పెద్దయిపోరని చురకలంటించారు. ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పారు. ప్రజలు టీఆర్‌ఎస్‌నే ఎందుకు ఆదరిస్తున్నారో గుర్తించాలని అన్నారు. ఇలాంటి ప్రేరేపణలు, ప్రేలాపణలకు తలొగ్గబోమని, రెచ్చగొడితే రెచ్చిపోబోమని స్పష్టంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సంయమనంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.



logo