మంగళవారం 26 మే 2020
Telangana - May 24, 2020 , 00:47:39

ఇంటింటా ఇంకుడుగుంత

ఇంటింటా ఇంకుడుగుంత

  • పదిరోజులకోసారి ట్యాంకుల శుభ్రత
  • ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిద్దాం
  • మెగా వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఎర్రబెల్లి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణంపై దృష్టిపెట్టాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఈ విషయంలో సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్‌, మెదక్‌ జిల్లా మల్కాపూర్‌ గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. పల్లెప్రగతి స్ఫూర్తితో వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులను తరిమికొడదామన్నారు. ‘గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలతో నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు పెరుగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుందాం.

 ప్రజల్లో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచి సీఎం కేసీఆర్‌ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధిద్దాం’ అంటూ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మంత్రి దిశానిర్దేశంచేశారు. సీజనల్‌ వ్యాధులు, వాటి నివారణకు ముందు జాగ్రత్త చర్యలపై లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి శనివారం మంత్రి మెగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రెండోవిడుత పల్లెప్రగతి విజయవంతమైనందున ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ నుంచి తెలంగాణ పల్లెలను సురక్షితంగా ఉంచగలిగామన్నారు. గ్రామాల్లో ప్రతినెలా 1, 11, 21 తేదీల్లో పదిరోజులకు ఒకసారి ట్యాంకులను శుభ్రంచేయాలని, లీకేజీలు లేకుండా, నీరు కలుషితం కాకుండా చూడాలని సూచించారు. 

మంత్రి కేటీఆర్‌ సూచించినట్టు ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని కోరారు. పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు నిధుల కొరత లేదని, విధుల్లో నిర్లక్ష్యాన్ని క్షమించబోమని హెచ్చరించారు.  25 జిల్లా కేంద్రాలు, 358 మండలాల నుంచి మెగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 87 మంది జిల్లాల ప్రజాప్రతినిధులు, 15,156 మంది మండల ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు 459, మండలస్థాయి అధికారులు 38,003 మంది పాల్గొన్నారు. కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.logo