శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 01:44:23

ఐటీలో అద్భుత పురోగతి

ఐటీలో అద్భుత పురోగతి
  • ఎగుమతుల్లో దేశానికే తెలంగాణ ఆదర్శం
  • ‘ఇండియా సాఫ్ట్‌-2020’ సదస్సులో మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) ఎగుమతుల్లో తెలంగాణ అద్భుత పురోగతిని సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం హెచ్‌ఐసీసీలో ‘ఇండియా సాఫ్ట్‌-2020’ 20వ సదస్సు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ గతేడాది 17 శాతం, ఈ ఏడాది 18 శాతం వృద్ధి సాధించిందని, 8 శాతంగా ఉన్న జాతీ య సగటు వృద్ధితో పోలిస్తే ఇది ఎంతో ఎక్కువని తెలిపారు. యాపిల్‌, అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ లాంటి ప్రపంచస్థాయి కంపెనీలకు హైదరాబాద్‌ సరైన వేదికగా నిలుస్తున్నదని, ఈ సంస్థలన్నీ తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేశాయని పేర్కొన్నారు. 


ఐటీ సంస్థలు గతేడాది హైదరాబాద్‌లో 14 మిలియన్ల చదరపు ఆఫీస్‌ స్పేస్‌ను వినియోగించుకొన్నాయని, ఇది దేశంలోనే అత్యధికమని స్పష్టంచేశారు. ఇండియాలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌ అయిన టీ-హబ్‌ ప్రస్తుతం రెండో కేంద్రాన్ని ప్రారంభించనున్నదని, ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా నిలుస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని, ఐటీ రంగానికి కేంద్రమైన బెంగళూరు నగరాన్ని హైదరాబాద్‌ అధిగమించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సంయుక్త కార్యదర్శి అరుణ్‌గోయల్‌ మాట్లాడుతూ.. దేశంలో డిజిటల్‌ టెక్నాలజీ విప్లవం ప్రారంభమైందని, ఐటీరంగంలో భారత్‌ గ్లోబల్‌ లీడర్‌గా నిలుస్తుందని చెప్పారు. ఈ సదస్సులో ఇండియా సాఫ్ట్‌ చైర్మన్‌ నలిన్‌కోహ్లీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ మన్‌దీప్‌సింగ్‌పురి తదితరులు పాల్గొన్నారు.


logo