సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 01:15:01

తీరు మారకుంటే వేటే

తీరు మారకుంటే వేటే

  • ప్రైవేట్‌ ల్యాబ్‌లకు మంత్రి ఈటల హెచ్చరిక 
  • సరైన లెక్కలను రెండుమూడు రోజుల్లో తేలుస్తామన్న మంత్రి 
  • సోమవారం నుంచి టిమ్స్‌లో విధుల్లోకి సిబ్బంది 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నిర్ధారణ పరీక్షలుచేసే ప్రైవేట్‌ ల్యాబ్‌లన్నీ ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందేనని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. ప్రభుత్వ ల్యాబ్‌లలో మాదిరిగానే ప్రైవేట్‌ ల్యాబ్‌లలో పరీక్షలపైనా నిరంతర పరిశీలన కొనసాగుతుందని చెప్పారు. తీరు మార్చుకోని ల్యాబ్‌లపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో మోసం జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా నియంత్రణ, టిమ్స్‌లో వసతులు తదితర అంశాలపై మంత్రి ఈటల రాజేందర్‌.. శనివారం బీఆర్కే భవన్‌లో వైద్యశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. కొన్ని ప్రైవేట్‌ ల్యాబ్‌లు దురాశతో తప్పుడు ఫలితాలు విడుదలచేస్తుండటంపై మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కొన్ని ల్యాబ్‌ల్లో 70% పాజిటివ్‌ రావడంపై విస్మయం వ్యక్తంచేశారు. అలాంటి ల్యాబ్‌లకు నోటీసులు ఇచ్చామన్నారు. ఈ ఘటనపై నియమించిన నిపుణుల కమిటీ పరీక్షా విధానంలో లోపాలు, ఇతర అంశాలను పరిశీలించి రెండుమూడు రోజుల్లో నివేదిక అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ల్యాబ్‌ల సామర్థ్యాన్ని రోజుకు 6,600 పరీక్షలకు పెంచేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

టిమ్స్‌ సిబ్బంది ఎంపిక పూర్తి 

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)లో వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తయిందని మంత్రి ఈటల పేర్కొన్నారు. 499 పోస్టులకుగానూ మొత్తం 13 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని వడబోసి 499 మందిని ఎంపికచేశామని చెప్పారు. వీరంతా సోమవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలిపారు. 

కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే 

వానకాలం నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరం వంటివి సాధారణమేని మంత్రి తెలిపారు. కరోనా లక్షణాలుకూడా ఇవే కావడంతో అందరూ ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంటింటికీ సర్వేచేసి బాధితులను గుర్తిస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నిపుణుల కమిటీ సభ్యులు కరుణాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌రెడ్డి, కరోనా నోడల్‌ ఆఫీసర్‌ శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo