ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 15:15:07

ఆరోగ్య శ్రీని ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తాం : మ‌ంత్రి ఈట‌ల‌

ఆరోగ్య శ్రీని ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తాం : మ‌ంత్రి ఈట‌ల‌

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో ఆరోగ్య శ్రీని ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తామ‌ని, ఈ విష‌యంలో ఎవ‌రూ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లో ఆరోగ్య‌శ్రీ స‌మ‌స్య‌ల‌పై సంబంధిత అధికారుల‌తో చ‌ర్చించామ‌ని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు ఆరోగ్య‌శ్రీలో మార్పులు చేస్తున్నామ‌ని చెప్పారు. కార్పొరేట్ ఆస్ప‌త్రికి వెళ్లినా ఏ ఒక్క‌రోగి కూడా వెన‌క్కి తిరిగి రాకుండా.. ఆరోగ్య‌శ్రీ కింద చికిత్స చేయించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అర్హులైన పేద‌ల‌పై ఒక్క రూపాయి కూడా భారం ప‌డ‌కుండా చికిత్స అందిస్తామ‌న్నారు. అందుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నామ‌ని తెలిపారు.

క‌రోనా తీవ్ర‌త‌, కేసులు త‌గ్గినా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి. కేర‌ళ‌లో ఓన‌మ్ వేడుక‌ల్లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేర‌ళ‌లో ఒక్క‌సారిగా కొవిడ్ కేసులు పెరిగాయి. రాష్ర్టంలోనూ బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పెద్ద పండుగ‌లు. ఈ రెండు పండుగ‌ల్లో ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌ను పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌భుత్వ సూచ‌న‌లు పాటించ‌క‌పోతే కేర‌ళ త‌ర‌హాలో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్నారు. గాంధీ ఆస్ప‌త్రి మిన‌హా అన్ని ఆస్ప‌త్రుల్లో అన్ని సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. కొవిడ్ సేవ‌ల్లో ఉన్న వైద్య సిబ్బంది మిన‌హా ఇత‌రులు విధుల‌కు రావాల‌ని ఆదేశించారు. 

దేశ వ్యాప్తంగా నులిపురుగుల నివార‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. క‌డుపులో నులి పురుగులు ఉంటే పిల్ల‌ల్లో ఎదుగుల ఉండ‌దు. తెలంగాణ‌లో ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి అల్బండ‌జోల్ టాబ్లెట్స్ ఇస్తారు అని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు.


logo