మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 15:46:22

సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోవాలి : మంత్రి ఎర్రబెల్లి

సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోవాలి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు, ముందు జాగ్రత్తగా వాటి నివారణ చర్యలపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్‌ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీసీవోలు, ఎంపీడీవోలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రూపొందించిన పల్లె ప్రగతి రెండు కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. పల్లెప్రగతితో గ్రామాల ముఖచిత్రాలు మారిపోయాయని స్పష్టం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతోనే కరోనా నుంచి గ్రామాలు సురక్షితంగా ఉన్నాయన్నారు. పల్లెప్రగతి స్ఫూర్తిని కొనసాగిస్తూనే వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ వంటి అనేక రకాల సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంతో పాటు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. దోమలు పెరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందించాలని మంత్రి దయాకర్‌రావు అధికారులకు సూచించారు.logo