శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 02:26:07

రైతు వేదికలు ఆదర్శ ప్రతీకలు

రైతు వేదికలు ఆదర్శ ప్రతీకలు

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన రైతు వేదికలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలోని ఏదులాబాద్‌లో జెడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డితో కలిసి రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 680 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎలాంటి పంటలు వేయాలి, పంటను ఏ ధరకు విక్రయించాలో రైతులే సమష్టి నిర్ణయం తీసుకునేలా సీఎం కేసీఆర్‌ రైతు వేదికలను నిర్మించారన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌, ధరణిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ వంటి బృహత్తర పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ యావత్తు తెలంగాణను పసిడి పంటలకు నిలయంగా మారుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.