మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 01:49:05

ఆన్‌లైన్‌లో ఆర్సీ అడ్రస్‌ మార్పు

ఆన్‌లైన్‌లో ఆర్సీ అడ్రస్‌ మార్పు

  • రవాణాశాఖలో సేవలు మరింత సులభం
  • మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రవాణాశాఖలో ఆన్‌లైన్‌ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని మరో ఆరు రకాల ఆన్‌లైన్‌ సేవలను శనివారం ఆయన ప్రారంభించారు. ఆర్సీలో అడ్రస్‌ మార్పు, రాష్ట్రం పరిధిలో క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌, కొత్త పర్మిట్‌, డూప్లికేట్‌ పర్మిట్‌, రెన్యూవల్‌ పర్మిట్‌, తాత్కాలిక లేదా ప్రత్యేక పర్మిట్‌ కోసం ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. శనివారం ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో టీఎస్‌ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో కలిసి కేక్‌ కోసిన పువ్వాడ.. ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎడమకాలు లేని వికలాంగులు ఆటోమెటిక్‌ కారు నడిపితే వారికి లైఫ్‌ ట్యాక్స్‌ మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఆర్థిక బలోపేతం కోసం తీసుకొచ్చిన కార్గో, పార్సిల్‌ సేవలు అనతికాలంలోనే వినియోగదారులకు చేరువకావడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలకు నిధులిచ్చి ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక అధికారి విజేంద్రబోయి, ఈడీలు పురుషోత్తం, యాదగిరి, వినోద్‌కుమార్‌, వీ వెంకటేశ్వర్లు, మునిశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, ఆరునెలల మోటర్‌ వాహనాల పన్నును మాఫీ చేసినందుకుగాను తెలంగాణ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి ఇల్లిటం నర్సింహారెడ్డి, ప్రతినిధులు కొండల్‌రెడ్డి, చక్రవర్తి, హనుమంతరావు, సుబ్బారెడ్డి తదితరులు ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌లో మంత్రి పువ్వాడను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Previous Article పాదభాష