మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 05, 2021 , 02:19:01

కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్క్‌

కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్క్‌

  • 20వేల నేత కుటుంబాలకు లబ్ధి
  • బతుకమ్మ చీరెల పంపిణీ యథాతథం
  • నేతన్నకు చేయూత త్వరలో షురూ
  • చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 4 (నమస్తే తెలంగాణ): వరంగల్‌ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుచేయనున్నట్టు పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తిమేరకు నేతన్నలకు మరింత ప్రయోజనం కల్పించడానికి సీఎం కేసీఆర్‌ కొడకండ్లలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు ఆదేశించినట్టు చెప్పారు. సో మవారం ప్రగతిభవన్‌లో జౌళిరంగం-ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. రాష్ట్రంలో నేతన్నల సం క్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు.

కొడకండ్లలో నైపు ణ్యం కలిగిన వేలమంది నేతన్నలు.. ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లారని, వీరి స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని.. కొడకండ్లలో ఉన్న అనుకూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకొంటూ.. టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జౌళి రంగానికి ఇస్తున్న మద్దతువల్ల వివిధ రాష్ర్టాలకు వలసవెళ్లిన చాలామంది నేత కార్మికులు స్వరాష్ర్టానికి తిరిగివస్తున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం నేతన్నలకు అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. 

ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరెల తయారీ 

బతుకమ్మ చీరెల తయారీ ఈ ఏడాది కూడా ఉంటుందని స్పష్టంచేశారు. గతంలో ప్రారంభించిన నేతన్నకు చేయూత కార్యక్రమం ద్వారా కరోనా సమయంలో నేతన్నలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందని చెప్పారు. కాలపరిమితికంటే ముందే తమ పొదుపుతోపాటు ప్రభుత్వ వాటాను ఒకేసారి వెనుకకు తీసుకొనేలా ప్రభు త్వం ఇచ్చిన మినహాయింపు ద్వారా 2.50 లక్షల నేతన్నల కుటుంబాలకు దాదాపు రూ.95 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగించాలని నేతన్నలనుంచి విజ్ఞప్తులు అందుతున్న నేపథ్యంలో త్వరలోనే మళ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని వచ్చే క్యాబినెట్‌లో కోరతామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో టెక్స్‌టైల్‌, చేనేత రంగాలకు సంబంధించిన కేటాయింపులపై కసరత్తు నిర్వహించి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మినీ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పా టు చేయాలని నిర్ణయించినందుకు వరంగల్‌ జిల్లా మంత్రి దయాకర్‌ రావు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పార్కు ఏర్పాటు వల్ల కొడకండ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు 20 వేలమంది నేతన్నల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.