ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 01:51:56

సీఎం సాబ్‌.. షుక్రియా

సీఎం సాబ్‌.. షుక్రియా
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అక్బరుద్దీన్‌ ధన్యవాదాలు
  • మతసామరస్యాన్ని కాపాడుతున్న గొప్ప నాయకుడని కితాబు

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్టీపరంగా పార్లమెంట్‌లో గట్టిగా వ్యతిరేకించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన లౌకకవాదాన్ని చాటుకొన్నారని మజ్లిస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ కొనియాడారు. సీఏఏని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేయడంతోపాటు నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ (ఎన్నార్సీ), నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌)కు వ్యతిరేకంగా చర్చ జరిపి దేశానికి లౌకిక సందేశాన్ని చాటుదామని సీఏం కేసీఆర్‌ చెప్పడం గొప్పవిషయమన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. మోదీ సర్కార్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, సమాజాన్ని మతప్రాతిపదికన విభజిస్తున్నదని ధ్వజమెత్తారు. 


సీఎం కేసీఆర్‌ ధన్యజీవి

మతవివక్షకు తావులేకుండా ప్రజలందరినీ సమదృష్టితో పాలిస్తున్న సీఎం కేసీఆర్‌ ధన్యుడని అక్బరుద్దీన్‌ ప్రశంసించారు. పాతబస్తీలోని చారిత్రక లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయాన్ని విస్తరించాలని, రోడ్డు విస్తరణలో తొలిగించిన అంబర్‌పేట ఏక్‌ఖానా మసీదును పునర్నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్బరుద్దీన్‌ ప్రస్తావించిన అంశాలపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. మహంకాళి మందిరం గురించి మాట్లాడి అక్బరుద్దీన్‌ తన లౌకికతను చాటుకున్నారని సీఎం కేసీఆర్‌ ప్రశంసిస్తూ.. తెలంగాణ ఎప్పటికీ ‘గంగా జమున తెహజీబ్‌'గా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.


logo