శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 08:25:58

కేసీఆర్‌ ఉన్న గడ్డపై పుట్టడం అదృష్టం

కేసీఆర్‌ ఉన్న గడ్డపై పుట్టడం అదృష్టం
  • మహాలౌకికవాదికి రుణపడి ఉంటాం
  • సీఏఏ నల్లచట్టం, ఎన్పీఆర్‌ కంపు చట్టం
  • సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీపై కరాఖండిగా
  • వ్యతిరేక తీర్మానం చేసినవారెవరూ లేరు
  • అసెంబ్లీలో ఎంఐఎం ఎల్పీనేత అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘మహా లౌకికవాది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఎప్పటికీ మీ వెన్నంటే ఉంటాం. కేసీఆర్‌ ఉన్న గడ్డపైన పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా’ అని ప్రతిపక్ష నేత, ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎనిమిదిరాష్ర్టాలు తీర్మానం చేసినా, సభానాయకుడు కేసీఆర్‌ తరహాలో అందరినీ కలుపుకొని కరాఖండిగా తీర్మానం చేసిన వారెవరూలేరని బల్లగుద్ది చెప్తున్నానని తెలిపారు. సోమవారం శాసనసభలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన మాట్లాడుతూ ప్రజలను మత ప్రాతిపదికన విడదీస్తున్న పౌరసత్వ సవరణ చట్టం, దేశపౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్న ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్డులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయాలని కోరారు. సీఏఏ నల్లచట్టం, ఎన్పీఆర్‌ కంపు చట్టమని విమర్మించారు.

దేశంలో సగానికిపైగా బర్త్‌ సర్టిఫికెట్లు లేవు

ఎన్పీఆర్‌లో అత్యంత అవమానకరమైన నిబంధనలను పొందుపరిచారని చెప్పారు. మహిళ తన వయస్సు చెప్పలేకపోతే, వివాహ సమయంలోనైనా, కాపురం మొదలు పెట్టిన సమయంలో వయస్సు ఎంత ఉందో తెలుపాల్సిన నిబంధన మహిళాజాతికే అవమానమకరమని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీఏఏ, ఎన్పీఆర్‌ తర్వాత ఎన్నార్సీని అమలుచేసి పౌరసత్వ సమస్యను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలో చాలామందికి బర్త్‌ సర్టిఫికెట్లు లేవని, వాళ్ల తల్లిదండ్రుల సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.

ఏ ఒక్కపత్రం సరిగ్గా లేక పోయినా ‘అనుమానిత పౌరుడు’జాబితాలో పెడుతారని, పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి నరకం చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. ఎన్యూమరేటర్‌, రిజిస్ట్రార్‌ దయాదాక్షిణ్యాలపై జీవితం ఆధారపడి ఉంటుందని, వారు డీ జాబితాలో చేరిస్తే అంతేసంగతులని చెప్పారు. సందేహాస్పదంగా ఉన్న పౌరులను డిటెన్షన్‌ సెంటర్‌కు పంపుతారని, అలా ఎంతమందిని డిటెన్షన్‌ సెంటర్‌లో పెట్టి ఎన్ని కోట్లు వృథా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో 85 లక్షల కుటుంబాలు ఉన్నాయని, సగం మందికి సొం తిండ్లు లేక చిరునామా మారుతుంటుందని చెప్పారు. అసోంలో ఎన్సార్సీ అమలుతో, దేశం కోసం కార్గిల్‌ యుద్ధంచేసినవారికీ చోటు దక్కలేదని వివరించారు.

ముఖ్యమంత్రి మహాలౌకికవాది

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని మతాలు, వర్గాలను కలుపుకొని సమధర్మం, సమన్యాయం పాటిస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్న మహాలౌకికవాది అక్బరుద్దీన్‌ కొనియాడారు. అందుకే ఆయనకు మజ్లిస్‌ మద్దతునిస్తున్నదని ప్రపంచానికి చాటిచెప్తామని స్పష్టంచేశారు. 70 ఏండ్లుగా మైనార్టీలను రాజకీయంగా ఉపయోగించుకున్నవారు తమ చేయి వదిలేశారని, కేసీఆర్‌ మాత్రం కష్టకాలంలో ఆఫ్తునిలా వెన్నంటి నిలిచారు.. నిలుస్తున్నారని చెప్పారు. తామెప్పటికీ మేలు మరువమని, మద్దతుగా ఉంటామన్నారు.

అన్నీ ఆలోచించాకే తీర్మానం: మంత్రి కొప్పుల

సీఏఏ చట్టాన్ని గుడ్డిగా వ్యతిరేకించలేదని, అన్ని విధాలుగా ఆలోచించాకే సీఎం కేసీఆర్‌ వ్యతిరేక తీర్మానంపై నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. ఇది సున్నిత అంశమని, దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దని పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

సీఏఏ, ఎన్నార్సీ ప్రజావ్యతిరేకం: భట్టి

సీఏఏ చట్టం, ఎన్పీఆర్‌, ఎన్నార్సీ ప్రజావ్యతిరేకమని కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. ఎన్పీఆర్‌లో పౌరసత్వంపై ఎవరైనా అభ్యంతరం తెలిపే ఆస్కారం కల్పించారని, దీని వల్ల వివాదాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్‌ మద్దతు తెలుపుతుందని చెప్పారు.

ఎన్పీఆర్‌ సర్వే నిలిపివేయాలి: షకీల్‌ అహ్మద్‌

సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రంలో సర్వమానవ సౌ భ్రాతృత్వం వెల్లివిరుస్తున్నదని ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. ముస్లింలతోపాటు అన్నివర్గాల ప్రజలకు ఇబ్బందిగా ఉన్న సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలను నిలిపివేయాలని డిమాండ్‌చేశారు.

తీర్మానం కాపీని చించేసిన రాజాసింగ్‌

సీఏఏ, ఎన్పీఆర్‌,ఎన్నార్సీతో ఏ వర్గానికి ఇబ్బంది లేదని, సభ్యులు తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తీర్మానం కాపీలను చించివేశారు. ఈ చట్టాలతో ఎవరికైనా నష్టం జరిగితే, తెలంగాణ వదిలివెళ్తానని ప్రకటించారు.


logo