గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:44:22

ల్యాండ్‌మార్క్‌ బిల్‌

ల్యాండ్‌మార్క్‌ బిల్‌

  • రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగకరమైనది 
  • రెవెన్యూ బిల్లుపై చర్చలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ 
  • ఐటీ అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ కృషి భేష్‌
  • కొత్త రెవెన్యూ చట్టానికి ఎంఐఎం పూర్తి మద్దతు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడే బిల్లును రూపొందించారని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రశంసించారు. దీన్నొక ల్యాండ్‌మార్క్‌ బిల్‌గా అభివర్ణించారు. శుక్రవారం అసెంబ్లీలో నూతన రెవెన్యూ బిల్లుపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. నూతన చట్టం పేదలు, రైతులు, అన్నివర్గాల భూకష్టాలు తీర్చేలా ఉండాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రేషన్ల విధానాన్ని సరళీకరించడం, పారదర్శకత పెంపొందించడం వంటి లక్ష్యాలు ఉండటం సంతోషకరమని చెప్పారు. గతంలో ఎన్నో చట్టాలు వచ్చినా.. భూ ఆక్రమణలకు అడ్డుకట్ట పడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాజా చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల ఆక్రమణకు గురైన వక్ఫ్‌ భూములను కాపాడాలని విజ్ఞప్తిచేశారు. వక్ఫ్‌ భూములు, దర్గాలు, ఆలయాల భూములను ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయొద్దని కోరారు. 

హరితహారం అద్భుతం

గచ్చిబౌలి, ఐటీ ప్రాంతాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ విశేషంగా కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అభినందించారు. సీఎం కేసీఆర్‌ సెక్యులర్‌ అని కొనియాడారు. హరితహారం కార్యక్రమం అద్భుతమని మెచ్చుకున్నారు. ఇలాంటి గొప్ప పథకాలు మరెక్కడా లేవన్నారు. 

యావత్‌ సమాజానికి మేలు

నూతన రెవెన్యూ చట్టం వల్ల రైతు సమాజానికే కాకుండా యావత్‌ తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేకూరనున్నది. భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోనున్నాయి. వక్ఫ్‌బోర్డు, దేవాదాయ, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూములకు మరింత రక్షణ లభించనున్నది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. -మహమూద్‌ అలీ, హోంమంత్రి

గిరిజనుల భూ సమస్యలకు పరిష్కారం

సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టంతో పేద రైతుల, గిరిజనుల భూ సమస్యలకు పరిష్కారం చూపారు. ఏంచేస్తే పేదల జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. కొత్త చట్టంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. 

-సత్యవతి రాథోడ్‌, గిరిజన సంక్షేమశాఖ మంత్రి

అద్భుతమైన చట్టం

రాష్ట్ర ప్రజలకు భూ ఇబ్బందులనుంచి శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన చట్టం అద్భుతంగా ఉన్నది. స్వయంగా రైతు కావటం వల్ల సీఎం కేసీఆర్‌ అనేక రైతు సంక్షేమ చర్యలకు శ్రీకారం చుట్టారు. వీఆర్వోలు, వీఆర్‌ఏలు సైతం ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

- గువ్వల బాలరాజు, అచ్చంపేట ఎమ్మెల్యే

చట్టాన్ని స్వాగతిస్తున్నాం

నూతన రెవెన్యూ చట్టాన్ని బీజేపీ స్వాగతిస్తున్నది. వీఆర్వో వ్యవస్థ వల్ల రైతులు అవస్థలు పడుతుండటం మాకూ తెలుసు. తాసిల్దార్లు, ఉన్నతాధికారులు లంచాలు తీసుకోకుండా కఠినచట్టాలు తీసుకురావాలి. దేవాదాయ, అటవీ, సీలింగ్‌ సర్‌ప్లస్‌ తదితర భూముల సర్వే ఎలా జరుగుతున్నదో స్పష్టత ఇవ్వాలి. భూముల సర్వే, రికార్డుల నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి.

- రాజాసింగ్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే

న్యాయపరమైన జాగ్రత్తలు 

రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సంబంధ సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. ట్రిబ్యునళ్ల ఏర్పాటును స్వాగతిస్తున్నాం. తాసిల్దార్లు, ఆర్డీవోల దగ్గర పెండింగ్‌లో ఉన్న అర్జీలు, వివిధ చట్టాల కింద ఉన్న రివిజన్‌ పిటిషన్లపై స్పష్టతనివ్వాలి. 

- దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంథని ఎమ్మెల్యేlogo