శనివారం 11 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 16:18:02

రైతులను ఇబ్బంది పెట్టిన మిల్లర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలి : కొప్పుల ఈశ్వర్‌

రైతులను ఇబ్బంది పెట్టిన మిల్లర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలి : కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల : ఇటీవల పంట కొనుగోలులో రైతులను ఇబ్బందులు పెట్టిన మిల్లర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని జిల్లా కలెక్టర్‌ను కోరడం జరిగిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. జగిత్యాల జిల్లా జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో నేడు హరితహారం 6వ విడత సన్నాహక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, విద్యాసాగర్‌, సుంకే రవిశంకర్‌, జిల్లా కలెక్టర్‌ రవి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో హరితహారం, పల్లె-పట్టణ ప్రగతి, నూతన సమగ్ర వ్యవసాయ సాగు విధానంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... హరిత తెలంగాణ సీఎం కేసీఆర్‌ లక్ష్యం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 150 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు.  

సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లా రైతులు స్వతహాగా తీర్మానించుకోవడం హర్షనీయమని మంత్రి అన్నారు. సీఎంపై అపారమైన నమ్మకంతోనే సూచించిన పంటలను రైతులు సాగుచేస్తున్నారన్నారు. పట్టణ, పల్లె ప్రగతి ద్వారా సీజనల్‌ వ్యాధులు దూరం అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఐకేపీ సెంటర్‌లో కొనుగోలు తర్వాత రైతుకు సంబంధం ఉండకుండా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అదేవిధంగా మిల్లర్లకు, రైతుకు సంబంధం లేకుండా ఇక నుండి కొనుగోళ్లు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల రైతులను ఇబ్బంది పెట్టిన మిల్లర్ల లిస్ట్‌ తీసి బ్లాక్‌లో పెట్టాలని కలెక్టర్‌ను కోరడం జరిగిందన్నారు. రైతుకోసం ప్రభుత్వం ఇంతచేసినా మిల్లర్ల దోపిడి దారుణమన్నారు. ధాన్యం ఈసారి జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో అదనంగా 2.10 లక్షల మెట్రిక్‌ టన్నులు రావటం రికార్డు అన్నారు. కాళేశ్వరం జలాల ఫలితమే అత్యధిక సాగు అని తెలిపారు.logo