మంగళవారం 26 మే 2020
Telangana - May 06, 2020 , 01:20:55

మా ఊర్లకుబోతున్నం!

మా ఊర్లకుబోతున్నం!

  • వలసకూలీల్లో ఆనందం
  • బయల్దేరిన 23 వేల మంది
  • రోడ్డుమార్గంలో 20 వేలు, రైళ్లలో 3 వేలు
  • నేడు 10 రైళ్లలో 13 వేల మంది 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వలస కార్మికులను వారి సొంత రాష్ర్టాలకు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రాం తాల నుంచి ఇప్పటికే 23 వేల మందిని తరలించింది. రోడ్డుమార్గంలో 20 వేల మంది, రైలుమార్గంలో మూడువేల మందిని పంపించింది. తొలుత వైద్య పరీక్షలు నిర్వహించి కార్మికులందరికీ జిల్లా కలెక్టర్లు పాస్‌లు జారీచేశారు. రోడ్డుమార్గం లో ఏడువేల మంది మహారాష్ట్రకు, మూడువేల మంది ఏపీకి, ఆరువేల మంది రాజస్థాన్‌కు, రెండువేల మంది మధ్యప్రదేశ్‌కు.. జార్ఖండ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన మరో మూడువేల మంది వరకు కూలీలు రైళ్లలో వెళ్లినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరో 13 వేల మంది కూలీలను పది రైళ్ల ద్వారా బుధవారం తెల్లవారుజామున తరలించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. శేరిలింగంపల్లి నుంచి మూడు రైళ్లు, చర్లపల్లి, ఘట్‌కేసర్‌ నుంచి రెండుచొప్పున, మేడ్చల్‌, మౌలాలి, బీబీనగర్‌ నుంచి ఒకటి చొప్పున పది రైళ్లు వెళ్లనున్నాయని మంగళవారం రాత్రి అధికారులు చెప్పారు. వీరిలో బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందినవారు అధికంగా ఉన్నారని అధికారులు తెలిపారు. 

పోలీస్‌స్టేషన్లవారీగా వివరాల సేకరణ

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇతర రాష్ర్టాల కూలీ ల వివరాలను పోలీస్‌స్టేషన్‌వారీగా రెవెన్యూ, పో లీస్‌ అధికారులు సేకరిస్తున్నారు. వారిని దగ్గరలోని ఫంక్షన్‌హాళ్లు, ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారు. అక్కడ కార్మికుల నుంచి ప్రస్తుతం ఉంటున్న స్థలం, ఏ రాష్ట్రం, ఎక్కడికి వెళ్లాలి.. ఫోన్‌నంబర్‌, ఆధార్‌కార్డు నంబర్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్నారు. ఏ రాష్ట్రం కూలీలు ఎంతమంది ఉన్నారనేది లెక్కించిన తర్వాత, వారి రాష్ర్టాలకు వెళ్లే రైలు అందుబాటులో ఉంచుతున్నారు. 

ఎమ్మెల్యే కోరుకంటి చొరవతో ఎన్టీపీసీ కార్మికులు

జ్యోతినగర్‌/దామరచర్ల: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో పనులు చేస్తున్న 80మంది బీహార్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులను స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు పంపించారు.  నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టుకు మంగళవారం పాసులు ఉన్నవారిని మాత్రమే ఏపీలోకి అనుమతించారు. 

వివిధ రాష్ర్టాల వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేస్తున్నది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, పాస్‌లు అందించి రైళ్లు, బస్సుల్లో తరలిస్తున్నది. ఇలా తెలంగాణ నుంచి ఇప్పటికే 23 వేల మంది సొంతూర్లకు వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున మరో 13 వేల మంది బయల్దేరనున్నారు. పైసా ఖర్చులేకుండా ప్రభుత్వమే అన్ని భరించి స్వస్థలాలకు పంపిస్తుండటంపై వలస కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.

సీఎం కేసీఆర్‌ చేతల మనిషి 

మాటలు చెప్పడం కాకుండా ఆచరణలో చూపించడమే సీఎం కేసీఆర్‌కు తెలుసునని ఐటీ మంత్రి కేటీఆర్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నా రు. ‘వారు వలస కార్మికులు కాదు.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు’అని సీఎం కేసీఆర్‌ గర్వంగా ప్రకటించారని గుర్తుచేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పనిచేస్తున్న వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రోజుకు 40 రైళ్లు నడపాలన్న నిర్ణయం దేశానికే ఆదర్శమన్నారు. 


logo