శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 13:44:38

ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకులదే కీలక పాత్ర

ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకులదే కీలక పాత్ర

సిద్దిపేట : ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల వారీగా ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయా, లేదా అనే విషయాలపై సూక్ష్మ పరిశీలకులు కీలకపాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా భారత ఎన్నికల సంఘం నుంచి జిల్లాకు విచ్చేసిన దుబ్బాక ఉప ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌-సాధారణ పరిశీలకులు శ్యామలా ఇక్బాల్ ఆధ్వర్యంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ..ఎన్నికల పోలింగ్‌ సరళిని క్షుణ్ణంగా పరిశీలించి, నిష్పక్షపాతంగా ఎన్నికలపై సమాచారం అందివ్వాలనన్నారు. ప్రతిచోట ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించి ఎన్నికల సంఘానికి నివేదిక పంపించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగాయా లేదా అనే విషయాలపై పర్యవేక్షకులు, అబ్జర్వర్లు తెలపాలని సూచించారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయడానికి, పోలింగు కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. అందులో సూక్ష్మ పరిశీలకులు కీలకంగా పోలింగు రోజున బాధ్యతగా విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల కోసం 58 మైక్రో అబ్జర్వర్లు నియమించామని వివరాలను వెల్లడించారు.

సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల్లో అబ్జర్వర్లకు కళ్లు, చెవులు లాంటివారని దుబ్బాక ఉప ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌-సాధారణ పరిశీలకులు శ్యామలా ఇక్బాల్ పేర్కొన్నారు. పోలింగు రోజు ఓటరు కార్డు పరిశీలిస్తున్నారా లేదా పూర్తయ్యేంత వరకు నిఘా ఉంచాలని సూచించారు. ఏదైనా అసాంఘిక చర్య జరిగితే వెంటనే ఎంవో అబ్జర్వర్లకు తెలియజేయాలన్నారు.శిక్షణ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారీ, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ - పోలింగ్ పర్సనల్ మైక్రో అబ్జర్వర్స్ ప్రతినిధులు శ్రవణ్, జీవరత్నం, అశోక్ లాల్ తదితరులు పాల్గొన్నారు.