మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 03:06:23

ఇప్పుడే స్కూళ్లు తెరువద్దు

ఇప్పుడే స్కూళ్లు తెరువద్దు

  • వైరస్‌వ్యాప్తి తగ్గితే సెప్టెంబర్‌- అక్టోబర్‌లో ప్రారంభించండి
  • ఎంహెచ్చార్డీ సర్వేలో తేల్చి చెప్తున్న తల్లిదండ్రులు
  • నెలాఖరులోగా కేంద్రానికి నివేదికలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  కరోనా వైరస్‌ నేపథ్యంలో 2020-21 విద్యాసంవత్సరంలో స్కూళ్లను ప్రారంభించాలా? ప్రారంభిస్తే ఎప్పట్నుంచి  తెరవాలి? ఆఫ్‌లైన్‌లో తెరవాలా? ఆన్‌లైన్‌లోనా? ఏ విధంగా విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలి? అనే అంశాలపై కేంద్రం సేకరిస్తున్న అభిప్రాయాల్లో భాగంగా తెలంగాణకు చెందిన తల్లిదండ్రులు రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు జిల్లాల నివేదికలు విద్యాశాఖకు అందినట్టు సమాచారం. వరంగల్‌కు చెందిన 612 మంది తల్లిదండ్రులు ఈ ఏడాది విద్యాసంవత్సరం వద్దని జీరో ఇయర్‌ చేయాలని కోరుతున్నారు. బలవంతంగా స్కూళ్లు ప్రారంభిస్తే తాము, తమ పిల్లలు బాధపడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. స్కూళ్లను ఆగస్టులో ప్రారంభించాలని 366 మంది, సెప్టెంబర్‌లో ప్రారంభించాలని 412 మంది, అక్టోబర్‌లో ప్రారంభించాలని 289 మంది, నవంబర్‌లో ప్రారంభించాలని 338 మంది కోరారు. స్కూళ్లలో ప్రతిరోజు శానిటైజ్‌ చేయాలని 1,956 మంది, విద్యార్థులందరికీ మాస్కులు పంచాలని 1,981 మంది, ప్రత్యేక ఫర్నిచర్‌ ఏర్పాటుచేయాలని 783 మంది, రక్షిత మంచినీటిని అందించాలని 897 మంది, మరుగుదొడ్ల సదుపాయాలు పెంచాలని 1,011 మంది, చేతులు కడుక్కోవడం, శానిటైజ్‌ చేయాలని  2,017 మంది పేర్కొన్నారు. ప్రస్తుతం స్కూళ్లను యథావిధిగా కొనసాగించాలని 426 మంది, రోజు విడిచి రోజు స్కూళ్లు పెట్టాలని 693 మంది, షిఫ్ట్‌ విధానంలో స్కూళ్లను నడిపించాలని 898 మంది తల్లిదండ్రులు తెలిపారు. రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన 1,232 మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉన్నాయి. ఆగస్టు నుంచి స్కూళ్లను ప్రారంభించాలని 236 మంది తల్లిదండ్రులు పేర్కొన్నారు.

చాలామంది తల్లిదండ్రులు విద్యార్థులకు నిత్యావసరాలను పంపిణీ చేయాలన్నారు. కొవిడ్‌-19 నియంత్రణకు అవసరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఉదయాన్నే నిర్వహించే అసెంబ్లీని రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. ఆటస్థలంలో ఆటలు ఆడించవద్దని అభిప్రాయపడ్డారు. స్కూల్‌ యూనిఫారంతోపాటు మాస్కులను తప్పనిసరిచేయాలన్నారు. స్కూళ్లకు విజిటర్లను రాకుండా  నియంత్రించడంలో కఠినంగా ఉండాలని కోరారు. షిప్ట్‌ పద్ధతులో తరగతులు. సిలబస్‌ను రేషనలైజేషన్‌ చేయాలని విజ్ఞప్తిచేశారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని అడిగారు. అన్ని స్కూళ్లలో ఆరోగ్య కార్యకర్తలు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని, టీచర్లు రోజు విడిచిరోజు స్కూళ్లకు వచ్చేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. 

కరోనా పడగవిప్పి కాచుక్కూర్చున్న నేపథ్యంలో పాఠశాలలు తెరువడం శ్రేయస్కరమా? తెరిస్తే పిల్లల ప్రాణాలను పణంగా పెట్టినట్టు కాదా? అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఏడాది స్కూళ్లు తెరువకపోవడం మంచిదని  భావిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి తగ్గితే సెప్టెంబర్‌, అక్టోబర్‌ లేదా నవంబర్‌ మాసాల్లో తెరువొచ్చని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను పునః ప్రారంభించడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నది. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలను తెరువద్దని, జీరో ఇయర్‌ చేయాలని అధికశాతం మంది అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తున్నది. 



logo