శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 07:39:51

ఎంజీబీఎస్‌ టూ జేబీఎస్‌ మెట్రో పరుగులు

ఎంజీబీఎస్‌ టూ జేబీఎస్‌ మెట్రో పరుగులు

హైదరాబాద్‌ : నగరంలో అన్ని రూట్లలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అన్‌లాక్‌ 4.0లో మెట్రో రైళ్లు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. హైదరాబాద్‌లో మూడు దశల్లో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 7న మియాపూర్‌ - ఎల్బీనగర్‌, 8న నాగోల్‌ - రాయదుర్గం మధ్య మెట్రో సర్వీసులు నడవగా.. బుధవారం ఎంజీబీఎస్‌ టూ జేబీఎస్‌ మధ్య ట్రైన్లు ఉదయం 7 నుంచి పరుగులు పెట్టాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు రైళ్లు నడవనున్నాయి. కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్న ప్రాంతాల్లో మెట్రోస్టేషన్లు మూసివేయనున్నారు. గాంధీ హాస్పిటల్‌, భరత్‌నగర్‌, మూసాపేట, యూసఫ్‌గూడ మెట్రోస్టేషన్ల మూసే ఉండనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా, స్టేషన్లు, రైళ్లలో మార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

నిత్యం స్టేషన్ పరిసరాలు, రైళ్లను సిబ్బంది శానిటైజ్‌ చేస్తున్నారు. కేవలం నగదు రహిత రూపంలో ప్రయాణం చేసేందుకు అధికారులు ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నారు. ఆన్‌లైన్‌, స్మార్ట్‌కార్డ్‌, క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లతో మాత్రమే జారీ చేస్తున్నారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక ట్రైన్‌ అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రయాణికులు ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరి చేశారు. లేకుంటే అధికారులు జరిమానా విధిస్తున్నారు. ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే స్టేషన్‌లోకి ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రతి మెట్రో స్టేషన్‌లో ఐసోలేషన్ రూం ఏర్పాటు చేశారు. కాగా, మంగళవారం కారిడార్‌-1లో 17వేల మంది, కారిడార్‌-3లో 9వేల మంది ప్రయాణించినట్లు మెట్రో అధికారులు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo