గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 17:38:27

న‌గ‌దు ర‌హిత విధానంలో మెట్రో టికెట్ల జారీ

న‌గ‌దు ర‌హిత విధానంలో మెట్రో టికెట్ల జారీ

హైద‌రాబాద్ : క‌రోనా వ్యాప్తి దృష్ట్యా స్మార్ట్ కార్డులు, న‌గ‌దు ర‌హిత విధానంలో మెట్రో టికెట్ల జారీ ఉంటుంద‌ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో స‌ర్వీసులు పునఃప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ఎన్వీఎస్ రెడ్డి శ‌నివారం మీడియాతో మాట్లాడారు. ద‌శ‌ల వారీగా మూడు కారిడార్ల‌లో మెట్రో స‌ర్వీసులు ప్రారంభం అవుతాయ‌న్నారు. ఉద‌యం 7 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే మెట్రో సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. 7వ తేదీ నుంచి మియాపూర్ - ఎల్బీన‌గ‌ర్ మార్గంలో, 8 నుంచి నాగోల్ - రాయ‌దుర్గం మార్గంలో, 9వ తేదీ నుంచి జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.

కంటైన్మెంట్ జోన్ల‌లో మెట్రో స్టేష‌న్ల‌ను మూసివేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గాంధీ ఆస్ప‌త్రి, భ‌ర‌త్‌న‌గ‌ర్‌, మూసాపేట్, యూసుఫ్‌గూడ‌, ముషీరాబాద్ మెట్రో స్టేష‌న్లు మూసి ఉంటాయి. మెట్రో స్టేష‌న్లు, రైళ్ల‌లో భౌతిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. భౌతిక దూరాన్ని సీసీటీవీల ద్వారా ప‌ర్య‌వేక్షిస్తామ‌న్నారు. ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌న్నారు. స్టేష‌న్ల ప‌రిస‌రాలు, రైళ్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజేష‌న్ చేయిస్తామ‌న్నారు. ప్ర‌యాణికుల ర‌ద్దీని బ‌ట్టి రైళ్ల వేళ్ల‌ల్లో మార్పులు చేర్పులు చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌యాణికులు త‌క్కువ ల‌గేజీతో ప్ర‌యాణించాలి. ప్ర‌తి మెట్రో స్టేష‌న్‌లో ఐసోలేష‌న్ రూంలు ఏర్పాటు చేస్తామ‌ని మెట్రో ఎండీ చెప్పారు. 


logo