గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:32:36

లాభాల్లోకి మెట్రో!

లాభాల్లోకి మెట్రో!
  • ప్రతి నెల సమకూరుతున్న 40 కోట్ల ఆదాయం
  • ప్యాసింజర్‌ టికెట్ల ద్వారా 30 కోట్ల రెవెన్యూ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ ఆశించిన విధంగానే ఆదాయవనరుగా మారుతున్నది. తక్కువ కాలంలోనే లాభాల బాటలోకి వచ్చి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రతి నెలా రూ.40 కోట్ల ఆదాయంతో దూసుకుపోతున్నది. హైదరాబాద్‌లో మొత్తం 72 కిలోమీటర్లకు ఇప్పటివరకు 69  కిలోమీటర్ల మెట్రో ఆపరేషన్లలో నాగోల్‌ నుంచి రాయదుర్గ్‌ కారిడార్‌ 3, ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ కారిడార్‌ 1, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ కారిడార్‌ 2కు సంబంధించి విడుతలవారీగా ప్రారంభిం చారు. ప్రతి నెలా రూ.40 కోట్ల ఆదాయం వస్తుండగా.. ఇందులో రూ.30 కోట్లు టికెట్ల ద్వారా కావడం విశేషం.  వేసవి నేపథ్యంలో టికెట్ల ఆదాయం మరింత పెరుగుతుందని మెట్రో అధికారులు భావిస్తున్నారు. మొత్తం మూడు కారిడార్లు కలుపుకొని 55 రైళ్లను 1000 ట్రిప్పులు నడిపిస్తున్నారు. ఇటీవల కొత్తగా అందుబాటులోకి తెచ్చిన జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మార్గంలో 25 వేల మంది ప్రయాణిస్తుండగా.. నిత్యం నాలుగు లక్షల మందికి మించి  మెట్రో రైల్‌లో ప్రయాణిస్తున్నట్టు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. 


వ్యాపారాన్ని విస్తరిస్తే మరిన్ని లాభాలు

మెట్రో స్టేషన్లలోని వ్యాపార సముదాయాలను లీజుకు ఇవ్వడం ద్వారా మెట్రో రైల్‌ సంస్థకు రూ.10 కోట్లు ఆదాయం  వస్తున్నది. మొత్తం 5 మిలియన్‌ చదరపు మీటర్ల వైశాల్యంలో వ్యాపార సముదా య నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు ప్రతిపాదిత వ్యాపార సముదాయ నిర్మాణాల్లో కేవలం 1.3 మిలియన్‌ చదరపు మీటర్ల వైశాల్యం స్థలం అందుబాటులోకి తెచ్చారు. దాంతో తక్కువ మొత్తంలో ఆదాయం సమకూరుతుండగా.. మొత్తం స్థలంలో వ్యాపారాలకు అనువుగా మారిస్తే ప్రతి నెల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటు ప్రయాణికుల సంఖ్య పెరుగడం.. ఆటు వ్యాపార ప్రాంతాల లీజులు పెరుగడం ద్వారా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ దేశంలోని మిగతా మెట్రోలకన్నా ముందుగా లాభాల బాటలోకి వచ్చి సరికొత్త రికార్డు సృష్టిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల వడ్డీ దాదాపు ఏటా రూ.1,300 కోట్లు చెల్లిస్తున్నట్టు సమాచారం. ఈ భారాన్ని వీలైనంత త్వరగా తగ్గించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.


రెండేండ్లలో మైలురాళ్లు 

ఢిల్లీ తర్వాత రెండో పొడవైన మార్గం

(69 కిలోమీటర్లు)లో సేవలు

నిత్యం 55 రైళ్లు వెయ్యి ట్రిప్పులతో

18 వేల కిలోమీటర్ల్లు ప్రయాణం

రెండేండ్లలో 16 కోట్ల మందిని

గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా

86 లక్షల కిలోమీటర్లు రాకపోకలు

ఇప్పటివరకు 4.1 లక్షల ట్రిప్పులు

నడపడమే కాకుండా 14 లక్షల

స్మార్ట్‌కార్డుల విక్రయం


logo