మంగళవారం 02 జూన్ 2020
Telangana - Jan 26, 2020 , 02:17:39

శివధర్‌రెడ్డికి రాష్ట్రపతి అవార్డు

శివధర్‌రెడ్డికి రాష్ట్రపతి అవార్డు
  • అకున్‌ సబర్వాల్‌ సహా 12 మందికి మెరిటోరియస్‌ సర్వీస్‌ అవార్డు
  • జాబితాను ప్రకటించిన కేంద్ర హోంశాఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉత్తమ సేవలందించిన పోలీసులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు విభాగాల్లో సేవా పతకాలను ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు శనివారం విజేతల జాబితాను వెల్లడించింది. నలుగురు అధికారులకు రాష్ట్రపతి పోలీస్‌ శౌర్యపతకం, 286 మందికి పోలీస్‌ శౌర్యపతకం, 93 మందికి రాష్ట్రపతి పోలీస్‌ ఉత్తమ సేవా పతకాలు, 657 మందికి మెరిటోరియస్‌ సర్వీస్‌ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర అనంతరం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ నుంచి అదనపు డీజీ శివధర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్‌ శౌర్యపతకం దక్కింది. ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌గా పనిచేసి ఇటీవల డిప్యుటేషన్‌పై ఢిల్లీ వెళ్లిన అకున్‌సబర్వాల్‌ను మెరిటోరియస్‌ సర్వీస్‌ అవార్డుకు ఎంపికచేశారు.


అకున్‌సబర్వాల్‌తోపాటు టీఎస్‌ఎస్పీ రెండో బెటాలియన్‌ కమాండెంట్‌ ఆర్‌ వేణుగోపాల్‌, హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ అదనపు డీసీపీ ఇక్బాల్‌ సిద్ధిఖి, బాచుపల్లి అదనపు కమాండెంట్‌ పీ సత్యనారాయణ, నిజామాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ డీ ప్రతాప్‌, ఖమ్మం టౌన్‌ ఏసీపీ జీ వెంకటరావు, నల్లగొండ డీఎస్పీ ఎస్‌ జయరామ్‌, కొండాపూర్‌ 8వ బెటాలియన్‌ ఆర్‌ఎస్సై ఎస్‌ రవీంద్రనాథ్‌, హన్మకొండ ఏఎస్సై కే సుధాకర్‌, పోలీస్‌ అకాడమీ ఏఎస్సై ఎం నాగలక్ష్మి, గండిపేట ఏఎస్సై ఆర్‌ అంతిరెడ్డి, పుప్పాల్‌గూడ సీనియర్‌ కమాండెంట్‌ డీ రమేశ్‌బాబు కూడా మెరిటోరియస్‌ సర్వీస్‌ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికైన పోలీసులను డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 


జైళ్లశాఖలో ఐదుగురు ఎంపిక 

తెలంగాణ జైళ్లశాఖకు చెందిన ఐదుగురు అధికారులు మెరిటోరియస్‌ సర్వీస్‌ అవార్డులకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ సురకంటి శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్‌ హెడ్‌వార్డర్లు సత్తు పరుశరాములు, దోపటి ప్రతాప్‌, ఆదిలాబాద్‌ జిల్లా జైలు హెడ్‌వార్డర్‌ జీ లాలు, హైదరాబాద్‌ చంచల్‌గూడ సెంట్రల్‌ జైలు హెడ్‌వార్డర్‌ ఈ సత్యనారాయణ, చెర్లపల్లి సెంట్రల్‌ జైల్‌ హెడ్‌వార్డర్‌ తోట చంద్రమౌలికి మెరిటోరియస్‌ సర్వీస్‌ విభాగంలో అవార్డులు దక్కాయి. అగ్నిమాపక, విపత్తుల నిర్వహణశాఖలో జనగామ స్టేషన్‌ ఫైర్‌ఆఫీసర్‌ రాజ్‌కుమార్‌, కామటాల ఫైర్‌మెన్‌ భాస్కర్‌రావు ఫైర్‌ సర్వీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు.


దక్షిణ మధ్య రైల్వేలో ముగ్గురు

రైల్వే పోలీస్‌ సిబ్బందికి రెండు విభాగాల్లో పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలెంటరీ, ప్రెసిడెంట్స్‌ పోలీస్‌ మెడల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు టీ చంద్రశేఖర్‌రెడ్డి, కే చక్రవర్తి, మౌలాలి ట్రైనింగ్‌ సెంటర్‌ ఎస్సై డీ బాలసుబ్రహ్మణ్యం పోలీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు.


logo