బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 02:46:36

మానసిక ధైర్యమే మందు

మానసిక ధైర్యమే మందు

  • నా భార్యతో కలిసి ప్లాస్మా దానంచేస్తా
  • కరోనా విజేత ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ ప్రకటన

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మానసిక ధైర్యమే కరోనాకు మందు అని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ నాగేందర్‌ పేర్కొన్నారు. కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలో సూచించడమే కాకుం డా, చికిత్స అందించడంలో ముందుండే నాగేందర్‌ సైతం కరోనా బారినపడ్డారు. ఆయన భార్యకు కూడా వైరస్‌ సోకింది. ధైర్యంగా మహమ్మారిని జయించి రెండురోజుల కిందట తిరిగి విధుల్లోచేరారు. ఈ సందర్భంగా ఆయన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ‘జూలై 1న కొంచెం నలతగా ఉన్నది. మరుసటిరోజు జ్వరం, ఒంటినొప్పులు తదితర లక్షణాలు బయటపడ్డాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా భార్యతో కలిసి కరోనా నిర్ధారణ పరీక్షచేయించుకోగా, ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. వెంటనే హోంఐసొలేషన్‌లో ఉన్నాం. నాకు బీపీ, షుగర్‌, లిపిడ్‌ సమస్యలున్నాయి. ఐదురోజుల తర్వాత శ్వాస సమస్య మొదలైంది. ఇద్దరం గాంధీలో చేరాం. డాక్టర్లకు నిమ్స్‌లో ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్టు తెలిసినా, సాధారణ రోగులకు ప్రభుత్వ దవాఖానపై నమ్మకం కలిగించేందుకే గాంధీలో చేరాం. మంత్రి ఈటల రాజేందర్‌, డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి సూచన మేరకు జూలై 10న నిమ్స్‌లో చికిత్స పొందాం. శ్వాస సమస్య ఎక్కువవడంతో సీటీస్కాన్‌ చేయించగా,లంగ్స్‌లో ఇన్‌ఫెక్షన్‌ పెరిగినట్టు తేలింది. వెంటనే ఐసీయూకు మార్చి చికిత్స చేశారు. వైద్యుల సూచనలు పాటించి పూర్తిగా కోలుకున్నాం. జూలై 23న డిశ్చార్జి అయ్యాక వారంపాటు హోంఐసొలేషన్‌లో ఉన్నాం. ఈ నెల 1న డ్యూటీలో చేరా. వైద్యులకు నిమ్స్‌లో ప్రత్యేక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. త్వరలో నా భార్యతో కలిసి ప్లాస్మా దానంచేస్తా’అని నాగేందర్‌ తెలిపారు.logo