శుక్రవారం 10 జూలై 2020
Telangana - May 30, 2020 , 02:09:15

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మేఘా పాత్ర అమోఘం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మేఘా పాత్ర అమోఘం

  • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోకీలక భూమిక
  • రికార్డు సమయంలో 15 పంప్‌హౌస్‌ల నిర్మాణం
  • గాయత్రి పంప్‌హౌజ్‌ ఇంజినీరింగ్‌ అద్భుతం
  • సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణతోనే సాధ్యమైంది: డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణకు జలసిరిని తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (మెయిల్‌) సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నది. క్లిష్టమైన పంప్‌హౌస్‌లతోపాటు టన్నెళ్లు, రిజర్వాయర్ల నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ కలను సాకారం చేయడంలో తన వంతు సహకారాన్ని అందిస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా ప్రసిద్ధికెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా సంస్థ ఒకటీ.. రెండు.. కాదు ఏకంగా పదిహేను పంప్‌హౌజ్‌లను రికార్డు సమయంలో పూర్తిచేసింది. సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించిన మర్కూక్‌ పంప్‌హౌజ్‌తో సహా ప్రాజెక్టులో అత్యంత కీలకమైన, క్లిష్లమైన పనులను ఈ సంస్థ పూర్తిచేయడం వల్లనే మూడు నాలుగేండ్లలోనే గోదావరిజలాలను గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవడం సులువైంది. మేఘా సంస్థ     చేపట్టిన పదిహేను పంప్‌హౌజ్‌ల నిర్మాణంలో ఇప్పటికే తొమ్మిది అందుబాటులోకి వచ్చాయి. ఇందులోని 89 మోటర్లు నిర్ణీత డిశ్చార్జి మేరకు గోదావరిజలాలను ఎత్తిపోయడంతో బీడు భూముల్లో గోదారమ్మ పరవళ్లు కనువిందు చేస్తున్నాయి. బీహెచ్‌ఈఎల్‌, ఆండ్రిజ్‌, జైలమ్‌ ఏబీబీ, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌, వెగ్‌ తదితర కంపెనీల సహకారంతో ఈ అరుదైన రికార్డులను మేఘా పూర్తిచేసింది. ప్రధానంగా గోదావరి నది నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎదురె క్కించి తద్వారా లక్షల ఎకరాల్లో సిరులు పండించడంలో మేఘా పూర్తిచేసిన లింక్‌-1, లింక్‌-2 పంప్‌హౌజ్‌లు కీలక భూమికి పోషించాయి. 

ఇంజినీరింగ్‌ చరిత్రలో రికార్డు...

కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా సంస్థ పూర్తిచేసిన తొమ్మిది పంప్‌హౌజ్‌ల పూర్తి సామర్థ్యం 3767 మెగావాట్లు. ఇంజినీరింగ్‌ చరిత్రలో ఇదో రికార్డు. గోదావరిజలాలను బేసిన్‌లోనే అత్యంత ఎత్తయిన 618 మీటర్ల స్థాయిలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌లోకి ఎత్తిపోయడాన్ని చారిత్రక రికార్డుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. సాధారణంగా ఒక పంప్‌హౌజ్‌గానీ, రిజర్వాయర్‌గానీ పూర్తిచేసేందుకు దశాబ్దాల సమయం పడుతుందనేది నిన్నటిదాకా సాగునీటిరంగ చరిత్రలో ఓ అనుభవం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కేవ లం మూడేండ్లలోనే తొమ్మిది పంప్‌హౌజ్‌ లను పూర్తిచేయడం, మరో నాలుగింటిని సిద్ధంగా ఉంచడం మేఘా కంపెనీ ఘనత. ఇంకో రెండు పంప్‌హౌజ్‌ల పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. గాయత్రి, అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌ వంటి పంప్‌హౌస్‌లు ఎక్కువ ఎత్తులోకి జలాల్ని ఎత్తిపోసే మోటర్లతో కూడినవి కావడం మరో విశేషం. అంతేగాకుండా గోదావరి నుంచి మూడో టీఎంసీని ఎత్తిపోసేందుకు లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్‌హౌజ్‌ల్లో 600 మెగావాట్ల సామర్థ్యంతో అదనంగా అమర్చుతున్న 15 మోటర్ల ఎలక్ట్రో-మెకానికల్‌ పనుల్ని కూడా మేఘా సంస్థనే చేపట్టింది. ప్యాకేజీ-8లో భాగంగా మేఘా సంస్థ నిర్మించిన గాయత్రి పంప్‌హౌజ్‌ అత్యంత కీలకమైంది. ఆసియాలోనే ఇది అతి పెద్ద భూగర్భ పంప్‌హౌజ్‌. 470 అడుగుల లోతులో నిర్మించా రు. ఇందులో ఒక్కోటి 139 మెగావాట్ల సామర్థ్యం గల 7 మోటర్లను అమర్చారు. ఒక్కో మోటరు 3వేల క్యూసెక్కుల నీటిని 111 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయగలవు. 

ఇది జీవితకాల గౌరవం

కాళేశ్వరం ప్రాజెక్టులో 3840 మెగావాట్ల మొత్తం సామర్థ్యం గల 89 మోటర్లతో పంప్‌హౌజ్‌లు నిర్మించి మేఘా సంస్థ కీలక పాత్ర పోషించింది. మా కంపెనీకి ఇదో జీవితకాల గౌరవంగా భావిస్తున్నాం. గోదావరిజలాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న అడుగుల్లో భాగస్వాములమై.. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కావడంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. ప్రపంచంలోనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పనులు పూర్తిచేయడం మాకు గర్వంగా ఉంది. ప్రధానంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యక్షంగా పాలుపంచుకుంటూ.. నిరంతరం పర్యవేక్షించడంతోనే మేం రికార్డుస్థాయిలో పనులు పూర్తిచేయడం సాధ్యమైంది.        సీఎం కేసీఆర్‌ మార్గదర్శకంతోపాటు ప్రతి ఒక్క ఇంజినీర్‌ సహకారం మాకెంతో  ప్రోత్సాహాన్నిచ్చింది.

- బీ శ్రీనివాస్‌రెడ్డి , డైరెక్టర్‌, మేఘా ఇన్‌ఫ్రా
logo