గురువారం 09 జూలై 2020
Telangana - Mar 01, 2020 , 02:54:37

నిలబడ్డ నీలగిరిబిడ్డ

నిలబడ్డ నీలగిరిబిడ్డ

దశాబ్దాలుగా దేహాలను పిప్పిచేసిన దయ్యం అంతమైంది. దాహం తీర్చుకోవడానికి నీరు గొంతులో పోసుకొంటే గరళమై బొక్కలను పెళుసుచేసిన మహమ్మారి మటుమాయమైంది. చక్కని కృష్ణమ్మ చెంతనే పారుతున్నా.. చుక్క మంచినీరు దక్కని దుస్థితి సమసిపోయింది. గత పాలకుల పాప ఫలితంగా నల్లగొండను పట్టి పీడించిన ఫ్లోరైడ్‌ భూతం పారిపోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో వంకర్లు తిరిగిన శరీరాలను, వంగిపోయిన జీవితాలను చూసి కండ్లనీళ్లు పెట్టుకొన్న ఉద్యమనేత కేసీఆర్‌.. స్వరాష్ట్రంలో జల స్ఫూర్తితో ఫ్లోరైడ్‌ రక్కసిని తెలంగాణ మేరలో లేకుండా పారదోలారు. భగీరథ ప్రయత్నంతో మంచినీటిని చెంతకు తెచ్చారు. ఫలితంగా నాడు యవ్వనంలోనే వృద్ధాప్యాన్ని చవిచూసిన జీవితాల్లో తిరిగి యవ్వన శోభ కనిపిస్తున్నది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆరేండ్లలో నల్లగొండ జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఫ్లోరైడ్‌ కేసు నమోదుకాకపోవడం ఇందుకు నిలువెత్తు తార్కాణం. నీలగిరి బిడ్డ లేచి నిలబడుతున్నడు.

 • విషపు నీటినుంచి నల్లగొండకు విముక్తి
 • ఆరేండ్లలో ఒక్క ఫ్లోరైడ్‌ కేసూ లేదు
 • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ భూతం ఖతం
 • 2015 నుంచి కొత్తగా నమోదు కాని ఫ్లోరోసిస్‌ కేసులు
 • జాతీయ సంస్థ ఐఎన్‌ఆర్‌ఈఎం ఫౌండేషన్‌ పరిశోధనలో వెల్లడి
 • పాఠశాలల్లో క్రమంగా తగ్గుతున్న బాధితుల సంఖ్య
 • సురక్షిత మంచినీటితో ఫలితమిస్తున్న మిషన్‌ భగీరథ
 • సాగునీటితో శాశ్వత పరిష్కారానికీ ప్రభుత్వం చర్యలు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రతివ్యక్తికీ నిత్యం 100 లీటర్ల రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో ప్రారంభమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక మిషన్‌ భగీరథ నల్లగొండ జిల్లాలో అమృతాన్ని పంచుతున్నది. దశాబ్దాలుగా జిల్లాను పట్టిపీడించిన ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొడుతున్నది. ఫ్లోరోసిస్‌ ప్రభావిత గ్రామాల్లోని పాఠశాలల విద్యార్థుల్లో ఫ్లోరైడ్‌శాతం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. 2016లో అత్యధికంగా 413 మంది విద్యార్థుల్లో ఫ్లోరైడ్‌ శాతం 1.5 పీపీఎం కంటే ఎక్కువ ఉండగా.. 2019లో ఆ సంఖ్య 94కు పడిపోయింది. రక్షిత మంచి నీరు అందిస్తున్న ఫలాలతోనే ఫ్లోరైడ్‌ ప్రభావం క్రమంగా కనుమరుగవుతున్నదని ఐఎన్నార్‌ఈఎంఎఫ్‌ తన పరిశోధనల్లో తేల్చింది. సాధారణంగా నీటిలో 0.5 నుంచి 1 పీపీఎం ఉండాల్సిన ఫ్లోరైడ్‌శాతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 40 శాతం గ్రామాల్లో అత్యధికంగా నమోదయింది. మర్రిగూడెం, నాంపల్లి మండలాల్లోని కొన్నిగ్రామాల్లో అయితే అత్యధికంగా 28 శాతం వరకు ఫ్లోరైడ్‌ ఉన్నది. 


ప్రకృతి వైపరీత్యానికి తోడు, సమైక్యపాలనలో పూర్తి విస్మరణకు గురైన ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్‌ భూతం ఏటా వేలమందిని వికలాంగులను చేసి బాధితులుగా మార్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాటి ఉద్యమనేతగా ఫ్లోరోసిస్‌ పీడిత మర్రిగూడెం, నాంపల్లి మండలాల్లో ఐదుసార్లు పర్యటించారు. ఫ్లోరైడ్‌ పీడ నుంచి నల్లగొండ జిల్లాకు ఏ విధంగా విముక్తి కల్పించాలో అప్పుడే ఆలోచించారు. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా మిషన్‌ భగీరథ పథకానికి రూపకల్పన చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌ నుంచే ఈ పథకం పనులను ప్రారంభించారు. మునుగోడుకు అత్యధికంగా నిధులు కేటాయించారు. సుమారు రూ.440 కోట్లతో బట్లపల్లిలో 70 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధిప్లాంట్‌ను నిర్మించారు. రూ.120 కోట్లతో అన్ని గ్రామాల్లోనూ అంతర్గత పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం చేపట్టి ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని అక్కంపల్లి బాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, దామరచర్ల, ఉదయసముద్రం గ్రిడ్ల ద్వారా మిషన్‌ భగీరథ నీటిసరఫరా జరుగుతున్నది.


క్రమంగా తగ్గుతున్న బాధితుల సంఖ్య

ఇంటింటికీ సరఫరా అవుతున్న రక్షిత మంచినీటితో ఫ్లోరోసిస్‌ ప్రభావం క్రమంగా కనుమరుగవుతున్నది. వైద్యఆరోగ్యశాఖ ఫ్లోరోసిస్‌ ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థుల నుంచి ప్రతిఏటా మూత్రనమూనాలు సేకరిస్తున్నది. నల్లగొండలోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో ఉన్న ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహిస్తున్నది. 2014 నుంచి 2019 వరకు ఈ సంఖ్యలో క్రమంగా తగ్గుదల నమోదవుతూ వస్తున్నది. ఏటా క్రమంగా ఫ్లోరైడ్‌ ప్రభావిత విద్యార్థుల సంఖ్య తగ్గుతుండటంతోపాటు.. 2015 నుంచి ఇప్పటివరకు కొత్తగా ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడం విశేషం. దీంతో ఫ్లోరైడ్‌ భూతం పూర్తిగా ఖతమైనట్టు నిర్దారణ అవుతున్నది. ఇటీవల చిన్నారుల్లో ఫ్లోరోసిస్‌కు సంబంధించి లక్షణాలు ఎక్కడా కనిపించడం లేదని ఈ ప్రభావం గతంలో ఎక్కువగాఉన్న మర్రిగూడెం, నాంపల్లి మండలాల్లోని ప్రజలు చెప్తున్నారు.


 • సాధారణంగా నీటిలో 0.5 నుంచి 1 పీపీఎంశాతం ఉండాల్సిన ఫ్లోరైడ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 40 శాతం గ్రామా ల్లో అధికంగా నమోదయింది. మర్రిగూడెం, నాంపల్లి మండలాల్లోని కొన్నిగ్రామాల్లో ఏకంగా 28 శాతం వరకు ఫ్లోరైడ్‌ ఉండటం గమనార్హం.
 • సాధారణంగా చిన్న పిల్లల్లో పుట్టుకతో వచ్చిన పండ్లు ఊడి.. వాటిస్థానంలో కొత్త పండ్లు వచ్చినపుడు వాటిపై పసుపు పచ్చగార ఉంటే సాధారణంగా ఆ చిన్నారి ఫ్లోరోసిస్‌ బాధితుడిగా  గుర్తిస్తారు.
 • 2016లో మొత్తం 50 పాఠశాలల్లోని 1,380 మంది అనుమానిత విద్యార్థుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షంచగా 413 మంది విద్యార్థుల్లో 1.5 పీపీఎం కంటే ఎక్కువ ఫ్లోరైడ్‌ శాతం ఉన్నట్టు తేలింది. 2019లో 94 మందిలో మాత్రమే ఎక్కువ ఉన్నట్టు గుర్తించారు.
 • రక్షిత మంచినీటిని అందిస్తూ తాత్కాలికంగా ఫ్లోరోసిస్‌ సమస్యను రూపుమాపిన తెలంగాణ ప్రభుత్వం.. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న శివన్నగూడెం, గొట్టిముక్కల, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తిచేసి మునుగోడు నియోజకవర్గానికి సాగునీరందించే ప్రణాళికలు సైతం సిద్ధం చేసింది. పూర్తిస్థాయిలో సాగునీరందితే భూగర్భ జలాలు పెరిగి.. ఫ్లోరోసిస్‌ భూతం నల్లగొండ నుం చి శాశ్వతంగా దూరమవుతుంది.


ఆవేదనకు కేసీఆర్‌ అక్షరరూపం


ఒళ్లు వంకర్లు తిరిగిన ఫ్లోరోసిస్‌ బాధితులను తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన ఉద్యమనేత కేసీఆర్‌ కండ్లారా చూశారు. గుక్కెడు నీళ్లు కరువై జీవితాలు చీకటిమయమైన వారినిచూసి ఆవేదన చెందారు.2005లో 25 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీల బృందంతో సమస్య తీవ్రంగా ఉన్న మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ఆ సమయంలో ఫ్లోరోసిస్‌ కష్టాలపై స్వయంగా పాట రాశారు. 2001 నుంచి తెలంగాణ సాధించేవరకు అయిదుసార్లు కేసీఆర్‌ నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్‌ పీడిత ప్రాంతాల్లో పర్యటించారు. మర్రిగూడ మండలకేంద్రంలో రెండుసార్లు బసచేశారు. ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి కార్యాలయాన్ని సైతం సందర్శించి ‘తెలంగాణ వచ్చిన తర్వాత.. నల్లగొండకు మంచి నీళ్లిస్తా..’ అనే సందేశం సైతం రాశారు. సాహితీవేత్త అయిన కేసీఆర్‌ ద్రవించిన తన హృదయం నుంచి జాలువారిన ఆవేదనకు పాటగా అక్షరరూపం ఇచ్చారు. 


‘సూడు సూడు నల్లగొండ.. గుండెమీద ఫ్లోరైడు బండ.. బొక్కలు వంకరబోయిన బతుకుల నల్లగొండ జిల్లా.. దుఃఖం వెళ్లదీసేది ఎన్నాళ్లు నల్లగొండ జిల్లా..?’

- కేసీఆర్‌


3,500 మందికి పునరావాసం


తెలంగాణ ప్రభుత్వం గతేడాదే మర్రిగూడ మండల కేంద్రంలో ఫ్లోరోసిస్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. దాదాపు 3,500 మంది బాధితులకు ఈ కేంద్రం ద్వారా చికిత్స అందిస్తున్నారు. జాతీయసంస్థ ఐఎన్నార్‌ఈఎం ఫౌండేషన్‌ (ఇండియన్‌ న్యాచురల్‌ రిసోర్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ మేనేజ్‌మెంట్‌ ఫౌండేషన్‌) ఆరేండ్లుగా దేశంలోని ఫ్లోరోసిస్‌ ప్రాంతాల్లో పనిచేస్తున్నది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఒడిశాతోపాటు నల్లగొండ జిల్లాలోనూ ఫ్లోరోసిస్‌ ప్రాంతాల్లో సమస్య నిర్మూలనకోసం కృషిచేస్తున్న ఆ సంస్థ.. ఇక్కడి ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ సత్ఫలితాలు ఇస్తున్నట్టు తేల్చింది. గత ఆరేండ్లలో ఒక్క ఫ్లోరోసిస్‌ కేసుకూడా కొత్తగా నమోదు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలే కారణమని ఆ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజనారాయణ్‌ఇందు ఇటీవల తన పర్యటనలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా జల్‌జీవన్‌మిషన్‌ కోసం ఐఎన్నార్‌ఈఎం ఫౌండేషన్‌ ప్రతినిధులు నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్‌ ప్రాంతాల్లో సాధించిన సత్ఫలితాలను అధ్యయనం చేశారు. ఈనెల 19న గుజరాత్‌, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులతో కూడిన ఐఎన్నార్‌ఈఎం బృందం మర్రిగూడెం మండలంలో పర్యటించింది. ప్రభుత్వ చర్యలను అడిగి తెలుసుకున్నది. 


కేసీఆర్‌ విజన్‌తోనే ఫ్లోరోసిస్‌ నివారణ

 • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

ఆరేండ్లుగా నల్లగొండ జిల్లాలో ఒక్క కొత్త ఫ్లోరోసిస్‌ కేసు కూడా నమోదుకాలేదనే వార్త ఎంతో సంతోషంగా.. గర్వంగా ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ‘రాష్ట్రంలో ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న సీఎం కేసీఆర్‌ విజన్‌.. మిషన్‌ భగీరథ ఇంజినీర్లు, అధికారుల సమర్థ పనితీరుతోనే ఎన్నోఏండ్లుగా నల్లగొండ జిల్లాను బాధించిన ఫ్లోరోసిస్‌ను నివారించగలిగారు’ అని ట్వీట్‌చేశారు. ‘మొజాంజాహి మార్కెట్‌ పునరుద్ధరణ పనులు అద్భుతంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ఈ విధమైన చారిత్రక కట్టడాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ఇలాగే ప్రత్యేకమైన డ్రైవ్‌లను ప్రారంభించాలి’ అని కేటీఆర్‌ మరో ట్వీట్‌ద్వారా అధికారులకు సూచించారు.


తాగేటందుకు మంచినీళ్లు లేకనే మాలాంటి వాళ్ల బతుకులు వొంగిపోయినయ్‌. ఫ్లోరోసిస్‌ విముక్త పోరాటసమితిగా మేమంతా ఏర్పాటై మంచినీళ్ల కోసం ఎన్నో పోరాటాలు జేసినం. మా సమితి నేతలు ఆనాడు నన్ను ప్రధాని వాజపేయిగారి టేబుల్‌మీద పడుకోబెట్టి సమస్య జెప్పిండ్రు. అయినా గుక్కెడునీళ్లు మాకు శానా రోజులు రాలేదు. ఇప్పుడు ప్రతిఇంటికి కేసీఆర్‌ నీళ్లొస్తున్నయ్‌. తెలంగాణ ఏర్పాటై, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినంకనే నెలకు రూ. 3 వేలు పింఛనొస్తున్నది. అంతకుముందు ఐదొందలే వొచ్చేది. కేటీఆర్‌కు సమస్య జెప్పుకున్న. కలెక్టర్‌కు జెప్పిర్రు. వెంటనే నాకు మాఊరు శివన్నగూడెంల హెయిర్‌కటింగ్‌ షాప్‌ పెట్టిచ్చిర్రు. డబల్‌బెడ్‌రూం ఇల్లు గూడ కట్టిస్తమన్నరు. ఇంకాగాలేదు. తొందర్గ జెయ్యాలని కోరుకుంటున్న.

- అంశుల స్వామి, ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాటసమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు


ఆరేండ్లలో నల్లగొండలో ఒక్క ఫ్లోరోసిస్‌ కేసు కూడా నమోదుకాలేదు. మిషన్‌ భగీరథ ద్వారా అందిస్తున్న రక్షిత మంచినీరు సత్ఫలితాలు ఇస్తున్నది. రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ద్వారా కూడా మర్రిగూడెంలో సేవలు అందుతున్నాయి. మరిన్ని పునరావాస కేం ద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. 

- డాక్టర్‌ రాజ్‌నారాయణ్‌ ఇందు, ఐఎన్నార్‌ఈఎం ఫౌండేషన్‌ డైరెక్టర్‌


మిషన్‌ భగీరథ నీటి తో కొత్తగా చిన్నా రుల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఎక్కడా కనిపించడం లేదు. విద్యార్థుల్లో నూ ఈ సంఖ్య తగ్గుతున్నది. ప్రభుత్వ సహకారం, గత కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ చొరవతో మర్రిగూడెంలో ఏర్పాటుచేసిన ఫ్లోరోసిస్‌ పునరావాస కేంద్రం మంచి ఫలితం ఇస్తున్నది. 

- కంచుకట్ల సుభాష్‌, ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌


ఎన్కట బట్లపల్లి ఊరున్న దగ్గర ఫ్లోరైడ్‌ నీళ్లుండేవి. ఆ నీళ్లు తాగి శానా మంది ఆరోగ్యం ఖరాబ్‌ అయింది. అందుకని వేరే దగ్గర ఇండ్లు కట్టుకున్నరు. ఇప్పు డు ఆ ఊరి పక్కన్నే గౌర్నమెంట్‌ పెద్దవాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ కట్టింది. ప్రతిఇంటికి నల్లా కనెక్షన్‌ ఉన్నది. వట్టిపల్లిలో గూడ 450 ఇండ్లకు ఇప్పుడు ప్రతిఇంటికి మిషన్‌ భగీరథ నీళ్లొస్తున్నయ్‌. 

- స్వాతి, వట్టిపల్లి సర్పంచ్‌ 


ప్రతిఏడాది ఫ్లోరైడ్‌ ప్రభావ మండలాల్లో పాఠశాలలకు వెళ్లి వి ద్యార్థుల యూరిన్‌ సే కరించి పరీక్షలు జేస్తు న్నాం. 2014లో 392 మందికి 1.5 పీపీఎం కంటే ఎక్కు వ ఫ్లోరైడ్‌ శాతం ఉన్నది. 2019లో 94 మందికే ఉన్నది. కొత్తగా మాత్రం ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 

- కొండల్‌రావు, డీఎంఅండ్‌హెచ్‌వో, నల్లగొండ


సంవత్సరాల వారీగా విద్యార్థుల్లో ఫ్లోరోసిస్‌ ప్రభావం


ఏడాది
అనుమానితులు
1.5 పీపీఎం కంటే అధికం
2014
663
392
2015
624
397
2016
742
413
2017
903
361
2018
884
312
2019
133
94logo