సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 03:35:04

సివిల్స్‌లో మనోళ్ల హవా

సివిల్స్‌లో మనోళ్ల హవా

  • హర్యానాకు చెందిన ప్రదీప్‌సింగ్‌కు ఫస్ట్‌ ర్యాంక్‌
  • 40 మందికిపైగా తెలంగాణ అభ్యర్థులకు ర్యాంకులు
  • 46వ ర్యాంకుతో రాష్ట్ర టాపర్‌ పీ ధాత్రిరెడ్డి
  • ఐపీఎస్‌ శిక్షణ పొందుతూనే ఐఏఎస్‌కు ఎంపిక మొత్తం 829 మంది అభ్యర్థులు ఎంపిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సివిల్‌ సర్వీసెస్‌లో మరోసారి తెలంగాణ హవా కొనసాగింది. మంగళవారం విడుదలచేసిన ఫలితాల్లో హర్యానకు చెందిన ప్రదీప్‌సింగ్‌ మొదటి ర్యాంక్‌ సాధించారు. కాగా రాష్ట్రం నుంచి 40 మందికిపైగా అభ్యర్థులు విజ యం సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కు చెందిన పీ ధాత్రిరెడ్డి జాతీయస్థాయి 46వ ర్యాంకుతో రాష్ట్రం నుంచి టాపర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఐపీఎస్‌ శిక్షణలో ఉన్న ఆమె ఐఏఎస్‌కు ఎంపికవడం విశేషం. కట్ట రవితేజ (77), సత్యసాయి కార్తీక్‌ (103), మకరంద్‌ (110), ప్రేమ్‌సాగర్‌ (170), బడేటి సత్యప్రకాశ్‌గౌడ్‌ (218), పిన్నాని సందీప్‌కుమార్‌ (244), రాహుల్‌ (272), తేజ్‌ దీపక్‌ (297), సంకీర్త్‌ (330), శీతల్‌కుమార్‌ (417), లక్ష్మీపవన గాయత్రి (427), కార్తీక్‌ (428), మృగేందర్‌ (505), వినయ్‌కాంత్‌ (516), రమేశ్‌ (690), భూక్యా నర్సింహస్వామి (741), రాథోడ్‌ రాహుల్‌ (745), శశికాంత్‌ (764), చౌటుప్పల్‌ మండలం గుండ్లబావికి చెందిన పెద్దిటి కృష్ణారెడ్డి, సుశీలాదేవి కుమార్తె ధాత్రిరెడ్డి గతేడాది ప్రకటించిన ఫలితాల్లో 233వ ర్యాంకు సాధించారు. 

ప్రస్తుతం హైదరాబాద్‌లో వల్లభాయ్‌పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో ఐపీఎస్‌ శిక్షణ పొందుతున్నారు. ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో మరోసారి సివిల్స్‌ రాశారు. ఇంటర్‌వరకు హైదరాబాద్‌లోనే చదివిన ఆమె.. ఖరగ్‌పూర్‌లో ఐఐటీ పూర్తిచేశారు. కొంతకాలం ముంబైలో ఉద్యోగం చేశారు. ప్రజలకు నేరుగా సేవచేయాలన్న సంకల్పంతో ఐపీఎస్‌ శిక్షణ పొందుతూనే మూడోసారి సివిల్స్‌ పరీక్షలకు హాజరయ్యానని ధాత్రిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఈ విజయం సాధించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని, తల్లిదండ్రుల ప్రోత్సాహం మరిచిపోలేనని చెప్పారు.

జర్నలిస్టు కుమారుడు రవి‘తేజం’

77వ ర్యాంకర్‌ కట్ట రవితేజ సీనియర్‌ జర్నలిస్టు ప్రసూన కుమారుడు. ఖమ్మం జిల్లా గార్ల మండలానికి చెందిన ఆయన విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది. తమ విజయానికి తల్లిదండ్రులే కారణమన్నారు. 

ఆటల్లో ప్రావీణ్యుడు కార్తీక్‌

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన సత్యసాయి కార్తీక్‌ 103వ ర్యాంకు సాధించారు. ఇంజినీరింగ్‌దాకా హైదరాబాద్‌లో చదివిన ఆయన జేఎన్టీయూహెచ్‌ అండర్‌ 19 టీమ్‌లో పాల్గొంటూనే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యారు. మూడో ప్రయత్నంలో ఉత్తమర్యాంకు సాధించారు. 

ఐఎఫ్‌ఎస్‌ ఎంపికే లక్ష్యం

170వ ర్యాంకర్‌ కేసారపు ప్రేమ్‌సాగర్‌ది వరంగల్‌ జిల్లా, పాలకుర్తి. ప్రజలకు సేవచేయాలని, ఉన్నత లక్ష్యాలు సాధించాలనే ఉద్దేశంతో సివిల్స్‌ రాశానని ప్రేమ్‌సాగర్‌ తెలిపారు. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌కు ఎంపిక కావాలన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

తల్లి ప్రోత్సాహంతోనే విజయం

జడ్చర్లకు చెందిన శశికాంత్‌ గతేడాది సివిల్స్‌లో ఐఆర్‌టీఎస్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది మరోసారి సివిల్స్‌ రాసి 764వ ర్యాంకు సాధించారు. తనకు ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) వస్తుందని ఆశిస్తున్నానని శశికాంత్‌ చెప్పారు. తండ్రి గతంలోనే మరణించారని, తల్లి అన్నీ తానై తనను చదివించారన్నారు.

హైదరాబాద్‌లో కోచింగ్‌ కలిసొచ్చింది       

428 ర్యాంకర్‌ కొల్లాబత్తుల కార్తీక్‌ బాంబే ఐఐటీ బీటెక్‌ పూర్తిచేశారు. టాటా స్టీల్స్‌ జంజెడ్‌పూర్‌లో ఉద్యోగానికి రాజీనామాచేసి హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకున్నారు. ఇక్కడ కోచింగ్‌ బాగా కలిసొచ్చిందని కార్తీక్‌ తెలిపారు. 

ఏడో ప్రయత్నంలో 764 ర్యాంక్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని ఒక చిన్న పల్లెటూరు 764వ ర్యాంకర్‌ కె.శశికాంత్‌ది. సివిల్స్‌ కోసం ఎంతో కష్టపడ్డానని, పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వదులుకున్నానని శశికాంత్‌ చెప్పారు.  

తొలి ప్రయత్నంలోనే మంచిర్యాంకు 

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలోని తంగడపల్లికి చెందిన బడేటి సత్యప్రకాష్‌గౌడ్‌ తొలి ప్రయత్నంలోనే 218 ర్యాంకు సాధించారు. తాను ఎలాంటి కోచింగ్‌కు వెళ్లకుండానే సివిల్స్‌ సాధించడం గర్వకార ణంగా ఉన్నదన్నారు. 

టైలర్‌ కుమారుడికి 417వ ర్యాంక్‌ 

నల్లగొండకు చెందిన టైలర్‌ రేణుకుంట్ల నరేందర్‌, సుజాత కుమారుడు శీతల్‌కుమార్‌ సివిల్స్‌ ఫలితాల్లో 417వ ర్యాంక్‌ సాధించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రయత్నిస్తూ ఏడోసారి 417ర్యాంకు సాధించారు. 

మంచి ఆఫీసర్‌గా పేరు తెచ్చుకోవాలి

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేట మంద మకరంద్‌ కుటుం బం సిద్దిపేటలో స్థిరపడింది. తల్లిదండ్రులు మంద సురేశ్‌-నిర్మల ప్రభుత్వ ఉపాధ్యాయులు. రెండో ప్రయత్నంలో 110వ ర్యాంకు సాధించారు. 

కలెక్టరైన కానిస్టేబుల్‌ కుమారుడు

సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ కుమారుడు వినయ్‌కాంత్‌ సివిల్స్‌లో 516వ ర్యాంకును సాధించాడు. ఏడాది క్రితం వరకు రాజ్యసభ సెక్రటరీ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తూ సివిల్స్‌కు ప్రిపెరై ర్యాంకును సాధించారు.

గిరిజన బిడ్డకు 741వ ర్యాంక్‌

వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన భూక్య గన్య, భద్రమ్మ కుమారుడు నర్సింహస్వామి సివిల్‌ సర్వీసులో 741వ ర్యాంకు సాధించారు. 

సింగరేణి కార్మికుడి కుమారుడికి సివిల్స్‌

మంచిర్యాల జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు దరిపెల్లి రాజమల్లు, పుష్ప కుమారుడు రమేశ్‌  సివిల్స్‌లో 690వ ర్యాంక్‌ సాధించారు. 2014 నుంచి సివిల్స్‌ రాస్తూ నాలుగోసారి 690 ర్యాంక్‌ సాధించాడు.

బెల్లంపల్లివాసికి 330 ర్యాంక్‌

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగంలో ఎలక్ట్రీషియన్‌ సత్యనారాయణ కుమారుడు సంకీర్త్‌ సివిల్స్‌లో 330 ర్యాంక్‌ సాధించారు. సివిల్స్‌ సాధించేవారు 24 గంటలూ కష్టపడి చదవాలన్న నియమమేమీ లేదని, మనం ఎలా చదివాం అన్నదే ముఖ్యమని సంకీర్త్‌ చెపుతున్నారు.

మాజీ ఎంపీ రాథోడ్‌ కుమారుడు..

ఆదిలాబాద్‌ మాజీఎంపీ రాథోడ్‌ రమేశ్‌ చిన్న కుమారుడు రాథోడ్‌ రాహుల్‌ 745 ర్యాంకు సాధించారు. 

మాజీఎమ్మెల్యే మదన్‌లాల్‌ కుమారుడు..

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన బానోతు మృగేందర్‌లాల్‌ సివిల్స్‌లో 505వ ర్యాంకు సాధించారు. ఆయన వైరా మాజీఎమ్మెల్యే మదన్‌లాల్‌ కుమారుడు. గతేడాది సివిల్స్‌లో 551వ ర్యాంకు సాధించి హైదరాబాద్‌లో ఐపీఎస్‌ శిక్షణ పొందారు. ప్రొబెషనరీగా మహారాష్ట్రలోని నాసిక్‌లో సేవలు అందిస్తున్నారు. 

మెరిసిన పేదింటి ఆణిముత్యం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఆకునూరి నరేశ్‌ ఆల్‌ ఇండియా సివిల్స్‌లో 782వ ర్యాంకు సాధించారు. నరేశ్‌ భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలోని కాశీంపల్లికి చెందిన ఆకునూరి సులోచన ఐలయ్య అనే నిరుపేద దంపతులకు రెండవ కుమారుడు. నరేశ్‌ తల్లిదండ్రులు కూలీ పని చేసుకుంటూ కుమారుడ్ని చదివించారు. 

కాగజ్‌నగర్‌ విద్యార్థికి 457 ర్యాంక్‌

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎంలో కార్మికుడిగా పనిచేసిన విసుదానంద శుక్ల కుమారుడు వివేకానందా శుక్లా మొదటి ప్రయత్నంలోనే 457వ ర్యాంక్‌ సాధించారు. logo