ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 02:26:09

1200 కోట్ల పెట్టుబడి

1200 కోట్ల పెట్టుబడి

  • ఐదేండ్లలో దశలవారీగా పెట్టుబడులు.. మెడ్‌ట్రానిక్‌ ప్రకటన
  • హైదరాబాద్‌కు మెడ్‌ట్రానిక్‌
  • ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఏర్పాటు
  • అమెరికా వెలుపల ఇదే పెద్దది
  • మెడ్‌టెక్‌ హబ్‌గా హైదరాబాద్‌
  • మరిన్ని పెట్టుబడులు వస్తాయి
  • ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి
  • వర్చువల్‌ మీటింగ్‌లో మంత్రి కేటీఆర్‌ 

అమెజాన్‌.. గూగుల్‌.. మైక్రోసాఫ్ట్‌.. ఇటీవలే వెల్‌స్పన్‌.. విభిన్న రంగాలకు చెందిన ప్రఖ్యాత కంపెనీలకు నెలవుగా మారుతున్న హైదరాబాద్‌ నగరానికి మరో ప్రపంచ ప్రసిద్ధ సంస్థ రాబోతున్నది. మెడికల్‌ డివైజెస్‌ తయారీలో ప్రఖ్యాతిగాంచిన మెడ్‌ట్రానిక్‌ సంస్థ.. హైదరాబాద్‌లో తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెడికల్‌ డివైజెస్‌ హబ్‌ దిశగా మెడ్‌ట్రానిక్‌ పెట్టుబడులు కీలకంగా మారబోతున్నాయి. 2016లో మంత్రి కే తారకరామారావు అమెరికా పర్యటన సందర్భంగా మెడ్‌ట్రానిక్‌ సంస్థతో మొదలైన సంప్రదింపుల ప్రక్రియ.. ఫలించి.. నిర్ణయాత్మక రూపం దాల్చింది. మెడ్‌ట్రానిక్‌ సంస్థకు అమెరికా వెలుపల ఇదే అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం కావటం విశేషం.


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వైద్య పరికరాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్‌ట్రానిక్‌ సంస్థ హైదరాబాద్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. అమెరికా అవతల తన అతి పెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపించాలని నిర్ణయించింది. ఇందుకుగాను రానున్న ఐదేండ్లలో రూ.1200 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే మెడ్‌ట్రానిక్‌ ఇంజినీరింగ్‌, ఇన్నోవేషన్‌ సెంటర్‌ అమెరికా అవతల అతి పెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం కానున్నది. ఈ పెట్టుబడుల ద్వారా హైదరాబాద్‌ మెడికల్‌ డివైజెస్‌ హబ్‌గా కూడా మారనున్నది. 

తెలంగాణ ప్రభుత్వం, మెడ్‌ట్రానిక్‌ కంపెనీ ఈ ప్రాజెక్టుపై రెండేండ్లుగా చర్చలు జరుపుతున్నాయి. 2016లో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అమెరికాలో పర్యటించినప్పుడు మెడ్‌ట్రానిక్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఒమర్‌ ఇస్రాక్‌తో సమావేశమయ్యారు. దానికి కొనసాగింపుగా మంగళవారం మంత్రి కేటీఆర్‌తో జరిగిన వర్చువల్‌ సమావేశంలో తమ పెట్టుబడికి సంబంధించి మెడ్‌ట్రానిక్‌ సంస్థ ప్రకటన చేసింది. పరిశోధన, అభివృద్ధి ఇన్నోవేషన్‌కు దారితీస్తుందని, ఇన్నోవేషన్‌ తమ కంపెనీ అభివృద్ధికి అత్యంత కీలకమైనదని ఒమర్‌ ఇస్రాక్‌ పేర్కొన్నారు. ఈ పెట్టుబడి భారతదేశం పట్ల తమ చిత్తశుద్ధికి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తుందని తెలిపారు. రోగు ల బాధను దూరంచేసి, వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్న తమ కం పెనీ లక్ష్యాలతోపాటు ఆరోగ్యరంగాన్ని మరింతగా విస్తరించాలన్న ప్రభు త్వ లక్ష్యాల మేరకు ఈ భాగస్వామ్యం ఉంటుందని ఆయన చెప్పారు.

మెడ్‌టెక్‌ హబ్‌గా తెలంగాణ: కేటీఆర్‌ 

మెడ్‌ట్రానిక్‌ కంపెనీ హైదరాబాద్‌ను తమ అతిపెద్ద ఆర్‌అండ్‌డీ సెంటర్‌కు గమ్యస్థానంగా ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ పెట్టుబడి ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనతోపాటు ఈ రంగంలో మరిన్ని కొత్త పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కంపెనీ పెట్టుబడి ద్వారా హైదరాబాద్‌ భారతదేశపు మెడికల్‌ డివైజెస్‌ హబ్‌గా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. మెడ్‌టెక్‌ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, మెడ్‌ట్రానిక్‌తో ఒప్పందం దీనిని సూచిస్తున్నదని తెలిపారు. మెడికల్‌ డివైజెస్‌ కంపెనీలతో కలిసి ప్రపంచ ఆరోగ్య రంగంలో సానుకూల మార్పు దిశగా పనిచేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 


మెడికల్‌ డివైజెస్‌ రంగంలో కొన్నేండ్లుగా చేపట్టిన కార్యక్రమాలను మంత్రి వివరించారు. కంపెనీ నూతన సీఈవోగా ఎంపికైన జెఫ్రీ ఎస్‌ మార్తాను కేటీఆర్‌ అభినందించారు. కం పెనీ భారత ఉపఖండ ఉపాధ్యక్షుడు మదన్‌కృష్ణ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో తమ కంపెనీ ఇన్నోవేషన్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. ఇక్కడి ఇంజినీరింగ్‌ విద్యార్థులు తమ సంస్థతో కలిసి పనిచేసేందుకు వీలు కలుగుతుందని, తద్వారా హెల్త్‌కేర్‌ రంగంలో అనేక మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తినాగప్పన్‌ పాల్గొన్నారు. 

ఈ పెట్టుబడి భారత్‌ పట్ల మా చిత్తశుద్ధికి నిదర్శనం. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తుంది. రోగుల బాధను దూరం చేసి, వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్న కంపెనీ లక్ష్యాలతోపాటు ఆరోగ్యరంగాన్ని మరింత విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఈ భాగస్వామ్యం ఉంటుంది. 

- మెడ్‌ట్రానిక్స్‌ చైర్మన్‌ ఒమర్‌ ఇస్రాక్‌


logo